ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, విలేకరులుజిల్లా ఉన్నతాధికారులు, పోలీసుల హెచ్చరికలు పని చేయలేదు. పండగ 10 రోజుల ముందు నుంచే మైక్, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం జరిపి నానా హైరానా పడిన అధికారుల ఆశలపై పందెం రాయుళ్లు నీళ్లు చల్లారు. యథేచ్ఛగా పందేలు, జూదాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిద్ధం చేసిన సుమారు 700 బరుల్లో పందేలు సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల్లో కోళ్లపై రూ.కోట్ల వ్యాపారం సాగింది. పలు ప్రాంతాల్లో పోలీసులకు పెద్ద మొత్తంలో సొమ్ములు కుమ్మరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తంగా ఈ ఏడాది పండగ సీజన్లో దాదాపు రూ.300 కోట్లకు పైగా సొమ్ములు చేతులు మారినట్లు అంచనా.ఎక్కడికక్కడే పందాలు, గుండాట, పేకాట జూదాలతో పాటు కొన్ని చోట్ల పట్టపగలే అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు సైతం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పండగ మూడు రోజులూ మహిళలు కూడా పందేల్లో ఉత్సహంగా పాల్గొన్నారు. నిబంధనలను పక్కన పెట్టి మద్యం విక్రయాలు కూడా ఎక్కువ చోట్ల సాగాయి. భారీ సంఖ్యలో బరులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడిపి, జనసేన నేతలు భారీగా బరులను ఏర్పాటు చేశారు. పోటీ పడి మరీ పార్టీకొక బరి చొప్పున సిద్ధం చేసి పందేలు సాగించారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కాకినాడ రూరల్, సామర్లకోట ప్రాంతాల్లో ఒక్కో చోట రెండేసి బరులు వెలిశాయి. ఇలా ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 బరులను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమలో 16 మండలాల్లోనూ భారీ సంఖ్యలో బరులు వెలిశాయి. గతంలో కత్తి పందేలు మాత్రమే జరిగేవి. గతేడాది నుంచి కత్తిపందేలకు తోడు జెట్టీ పందేలు కూడా అధికంగా జరిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు 30 బరులలో కోడిపందేలు, గుండాటలు జరిగాయి. పలు చోట్ల ప్రజాప్రతినిధులే పందేలను ప్రారంభించడం విశేషం. అమలాపురం నియోజకవర్గం మూడు మండలాల్లో కోడిపందేలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల మూడు రోజుల్లో భారీగా పందేలను నిర్వహించారు. అమలాపురం రూరల్‌లో ఇందుపల్లి, గున్నేపల్లి అగ్రహారం, బండారులంక, సమనస, వన్నెచింతలపూడి, పేరూరు కొంకాపల్లి, తాండవపల్లి, చిందాడగరువు, అల్లవరం మండలం అల్లవరం, గుండెపూడి, కోడూరుపాడు దేశకోడు వంతెన, రెల్లుగడ్డ, ఐ.పోలవరం మండలం కొమరగిరి, ఎదుర్లంక, కేశనకుర్రు, ఐ.పోలవరం, జి.వేమవరంలో మంగళ, బుధ వారాల్లో భారీ స్థాయిలో పందేలు సాగాయి. మండలంలో కేశనకుర్రుపాలెం, ఎదుర్లంక, కొమరగిరిలో భారీ టెంట్లు, ఐరన్ మెష్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కోడి పందేలు నిర్వహించారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువులో కోడిపందేల బరిలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 30 ప్రాంతాల్లో జరిగిన పందేల్లో రోజుకు రూ.3 నుంచి రూ.4 కోట్లు చేతులు మారాయని అంచనా. కాకినాడ రూరల్ అచ్చంపేట, సర్పవరంలో పెద్ద సంఖ్యలో పందేలు సాగాయి. తుని నియోజకవర్గంలో అత్యధికంగా 40కి పైగా బరుల్లో జరిగిన పందేలు, జూదాల ద్వారా అధిక మొత్తంలో సొమ్ములు చేతులు మారాయి. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పోటాపోటీగా పందేలు సాగాయి. భారీ మొత్తంలో ఇక్కడ సొమ్ములు చేతులు మారడంతో కూటమి నాయకులకు భారీగానే సొమ్ములు వెనకేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తాళ్లపూడి మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా పందేలు కొనసాగాయి. తాళ్లపూడి, పెద్దేవం, మలకపల్లి, రావూరుపాడు, మలకపల్లి, గజ్జరంలో పందేలు నిర్వహించారు. కడియం మండలం కడియపులంక, దుళ్లలో పందేలు యథేచ్ఛగా సాగాయి. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, శ్రీకృష్ణపట్నం, వెలుగుబంద, రాజానగరం, తోకాడ, ముక్కినాడలో పందేలు జోరుగా సాగాయి. శ్రీకృష్ణపట్నంలో పందేలు చూడ్డానికి ఎస్‌ఇడి స్క్రీన్లు, కుర్చోడానికి సోఫాలు, భారీ సౌండ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో పందేల్లో విజయం సాధించిన కోళ్ల యజమానులకు రాయిల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, రూ.లక్షా యాభై వేలు బహుమతిగా అందజేశారు.చాగల్లు మండలం మీనానగరం, ఊనగట్ల, కలవలపల్లి, చిక్కాల, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు శివారు పొలాల్లో కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు.సామాన్యుల జేబులు గుల్లచివరి రోజు బుధవారం భారీగా పందేలు సాగాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం తమ జేబులను గుల్ల చేసుకున్నారు. ఆయా శిబిరాల వద్ద గుండాట, పేకాటల వద్ద పోటీపడి జూదాల్లో పాల్గొన్నారు. పోలీసులతో ఒప్పందంబరుల ఏర్పాటుకు తొలుత అనుమతులు లేవని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కూటమి నేతల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు చోట్ల పోలీసులతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న పందెం రాయుళ్లు, గుండాట నిర్వాహకులు పెద్ద మొత్తంలో పోలీసులకు ముడుపులు చెల్లించుకొన్నట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఒక్కో బరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
