ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ రద్దు
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలకడంతో కార్పొరేట్ కళాశాలలకు వరంలా మారింది. నేటి నుంచి జిల్లాలో ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు నేటి నుంచి 20వ తేదీ వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. 27 సెంటర్లు ఏర్పాటు చేయగా తొలి దశలో భాగంగా నేడు 12 సెంటర్‌లలో పరీక్షలు జరగనున్నాయి. ఎంపిసి, బైపిసి జనరల్ విద్యార్థులకు 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. 77 సెంటర్లలో ఈ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జనరల్ విభాగంలో ఎంపిసి విద్యార్థులు 13,202 మంది, బైపిసి విద్యార్థులు 3,168 మంది ఉన్నారు. ఒకేషనల్ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్తులు 2,226 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,875 మంది ఉన్నారు. నేటి నుంచి వీరికి దశలవారీగా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.జంబ్లింగ్ విధానం రద్దు ఇంటర్మీడియట్‌లో సైన్స్ గ్రూపులకు చాలా డిమాండ్ ఉంది, సైన్స్ గ్రూపుల్లో ర్యాంకుల పేరుతో కార్పొరేట్, ప్రయివేటు కాలేజీలు ప్రతి ఏటా రూ. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. థియరీ పరీక్షలు సంగతి ఎలా ఉన్నా, ప్రాక్టికల్స్ పరీక్షల్లో తమకు అనుకూలంగా మార్కులు వేసుకునే అవకాశం గతంలో ఉండేది. ఇటువంటి విధానానికి జంబ్లింగ్ విధానంతో కొంత అడ్డుకట్ట పడింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జంబ్లింగ్ విధనానికి స్వస్తి పలికింది. దీంతో పాత విధానంతో పరీక్షల నిర్వహణ జరుగుతోంది. దీంతో కార్పొరేట్, ప్రయివేటు కళాశాలలు అడ్డదారుల్లో విద్యార్థులకు అధిక మార్కులు వేయించుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లో అరకొర వసతులు జిల్లాలో జూనియర్ కాలేజీలు 123 ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్, వెల్ఫేర్, హై స్కూల్ ప్లస్ మొత్తం కలిపి 46 ఉన్నాయి. మిగిలిన 77 కాలేజీలు ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాల చేతుల్లో ఉన్నాయి.
సాధారణ సబ్జెక్టులతో పోల్చితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ జువాలని, లాంటి సబ్జెక్టులు చదవటం కష్టం. భవిష్యత్తులో రాణించాలనే ఉద్దేశంతో విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. అరకొర వసతుల మధ్య చదువులు సాగిస్తునాఉ.ే ప్రభుత్వ కాలేజీల్లో సిలబస్ కూడా సకాలంలో పూర్తయిన దాఖలాలు లేవు. సబ్జెక్ట్ అధ్యాపకుల కొరత, రెగ్యులర్ అధ్యాపకుల బదిలీలతో ఏర్పడిన ఖాళీల్లో కనీసం ఒప్పంద అధ్యాపకులను సర్థుబాటు చేయకపోవటం వంటి సమస్యలు వేధించాయి. మరోవైపు ప్రయోగశాలల్లో చెప్పేవారు లేకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడంతో సైన్స్ విద్యార్థులు బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులు ప్రయోగాలు చేసుకునేందుకు ప్రయోగశాలల్లోనూ వసతులు పూర్తిగా కరువయ్యాయి. ప్రభుత్వ కాలేజీలలో సౌకర్యాలు కల్పించకపోవడంతో మరో వైపు కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వం నిర్ణయాలు చేయటంతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రాక్టికల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. ఒకేషనల్ విద్యార్ధులకు నేటి నుంచి 20 వరకూ, జనరల్ విద్యార్ధులకు 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్నాము. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, సంక్షేమ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తొలి దశలో నేడు 12 సెంటర్‌లలో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
– ఎంవివిఎస్. నర్శింహులు, ఆర్‌ఐఒ, తూర్పు గోదావర జిల్లా
