ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌వ్యవసాయ అనుబంధ, సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, హౌసింగ్, ఉపాధి హామీ, ఇంజినీరింగ్ తదితర విభాగాల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ పి.ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పనుల పురోగతిపై 100 రోజులు, 200 రోజుల కార్యాచరణ ప్రణాళిక నిర్ధేశించినట్టు తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 10న ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఆయా శాఖలు నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడంలో ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో లక్ష్యాలను సమర్థవంతంగా చేపట్టాల్సి ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతి, బడ్జెట్ కేటాయింపులు, పెండింగ్ బిల్లులు అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు, రాష్ట్ర స్థాయి నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాల ఆధారంగా పిపిటి రూపొందించి అందచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రణాళిక అధికారి ఎల్.అప్పల కొండ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.జయరామ లక్ష్మి, డిఎంహెచ్‌ఒ కె.వెంకటేశ్వర రావు, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్‌బివి.రెడ్డి, డ్వామా పీడీ ఎం.నాగ మహేశ్వర రావు, డిఇఒ కె.వాసుదేవ రావు, డిఎస్‌పి డికె.విజరు కుమారి, గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్ జ్యోతి, సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్ పాల్గొన్నారు.