ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం పెంచాలి

Sep 28,2024 23:43
ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం పెంచాలి

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ప్రభుత్వాసుపత్రుల్లో సేవలపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సూచించారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందజేసే వైద్య సేవల్లో మెరుగైన చికిత్స విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన పరిస్థితుల్లో మార్పులు రావడానికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైద్య వత్తి ఎంతో గౌరవప్రదమైనదని, వైద్య సేవలు అందించేవారు పరిమితులకు లోబడి పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లోటుపాట్లను అధిగమించేందుకు మార్పు తీసుకురావడంలో వైద్యులు కలిసి పని చేయాలన్నారు. సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా మన బాధ్యతలను మనం నిర్వర్తించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల కాలంలో మూడు శిశుమరణాలు సంభవించడం ఎంతో బాధను కలిగించిందన్నారు. మన నిర్లక్ష్యం వల్ల కొక్క ప్రాణం కూడా పోవడానికి కారణం కారాదని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు వచ్చే రోగులను చిరునవ్వుతో పలకరించి వైద్య సేవలు అందించడం ద్వారా వారిలో నిబ్బరాన్ని మనోధైర్యాన్ని కల్పించగలుగుతామని మంత్రి సత్య కుమార్‌ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య విధానం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. తొలుత రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆసుపత్రికి అందచేసిన 10 త్రీ సీటర్‌ వీల్‌ ఛైర్స్‌, 6 ఎస్‌ఎస్‌ వీల్‌ ఛైర్స్‌, 6 స్ట్రచ్చర్స్‌ను అందించిన రోటరీ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పట్టపగలు వెంకటరావును మంత్రి అభినందించారు. పర్యాటక సాంస్కతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణ వ్యవస్థపై, ఇక్కడ వైద్య సేవలు అందించే క్రమంలో. రోగులకు ఎదురవుతున్న సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.లక్ష్మీసూర్యప్రభ ఆసుపత్రికి సంబంధించిన వివరాలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎంఎల్‌ఎలు ఆదిరెడ్డి శ్రీనివాస్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, ఆసుపత్రి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బి.సౌభాగ్య లక్ష్మి పాల్గొన్నారు.

➡️