ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) అధికార పక్షం, ప్రతిపక్షంలో చేరకుండా సమస్యలు పరిష్కారంలో ప్రజా పక్షాన నిలబడి గొంతెత్తి పోరాడేది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే అని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న దిడ్ల వీర రాఘవులకు ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు అన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల రాఘవులు విజయాన్ని కాంక్షిస్తూ డోర్ టు డోర్ తిరిగారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉద్యోగులు కార్మికులను నిరుద్యోగులను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కూటమి అభ్యర్థులు గెలిపిస్తే సమస్యలపై గొంతు ఎత్తే ప్రశ్నే ఉండదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది తల ఊపడం తప్ప చేసేదేమీ ఉండదని అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ పై నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ పేరు చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిందని ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానని మోసపూరిత మాటలు చెబుతున్నారని విమర్శించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విద్యా వ్యవస్థ నాశనం కాకుండా శాసన మండలిలో ఎలుగెత్తి చాటారని ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువత, మేధావులు ఆలోచించి పిడిఎఫ్ ఎమ్మెల్సీ దిడ్ల వీర రాఘవులకు ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.
