ఉపాధి లేక నిరుద్యోగుల కష్టాలు

Jan 19,2025 00:14
ఉపాధి లేక నిరుద్యోగుల కష్టాలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి గతంలో మా పాలనలో లక్షలాది టీచర్‌ పోస్టులు భర్తీ చేసాం. జగన్‌ ప్రభుత్వంలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదు. జాబు కావాలంటే బాబు రావాలి. మేము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నిరాశలో ఉన్న నిరుద్యోగులకు మంచి రోజులు రప్పిస్తాం అంటూ గతేడాది జనవరి 10న తునిలో జరిగిన ‘రా కదిలి రా’ సభలో టిడిపి అధినేత, ప్రస్తుత సిఎం చంద్రబాబు హామీలు గుప్పించారు. ఇక్కడే కాదు ఎన్నికల అన్ని సభల్లోనూ ఆయన వరాల జల్లు కురిపించారు. ఆయన్ను నమ్మిన నిరుద్యోగులు కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇచ్చి గద్దెనెక్కించారు. తీరా చూస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పైగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేస్తున్న వారిని, ఎపి ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌, ఎపి ఎండిసి కాంట్రాక్టు వర్కర్లు, యానిమేటర్లు, కొన్ని చోట్ల ఆశా వర్కర్లను, స్కూల్‌ ఆయాలను తొలగించారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పించకపోగా తిరిగి ఉన్న ఉద్యోగాలను పీకేస్తుండడంపై ఇటు బాధితులు, అటు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడం లేదు. దీంతో వాటిల్లో నమోదైన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏటా 40 వేల మందికి పైగా నిరుద్యోగులు తయారవుతున్నారు. గత 12 ఏళ్ళలో దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు తయారయ్యారనేది ఒక అంచనా. అటు ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే దక్కుతున్నాయి. దీంతో అనేకమంది విధిలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌, చైన్నై, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.ఆగమ్య గోచరంగా నిరుద్యోగుల పరిస్థితిజిల్లాలో అనేకమంది నిరుద్యోగులు ప్రైవేట్‌ సంస్థల్లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అరకొర వేతనాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పలు ప్రైవేటు సంస్థల్లో రూ.7 వేలు నుంచి రూ.9 వేలకే పని చేయాల్సి వస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం తక్కువ వేతనాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో అనేకమంది అప్పుల పాలవుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కాకినాడ జిల్లాలో పారిశ్రామిక అభివద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పరిశ్రమలు రావడం లేదు. కాకినాడ సెజ్‌లో నేటికీ పదివేల ఎకరాల భూములు ఖాళీగానే ఉన్నాయి. 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఒక పరిశ్రమ కూడా రాకపోవడంతో ఉపాధికి ఆమడ దూరంలో నిరుద్యోగులు బతుకు తున్నారు. ఒకటి, రెండు అతి చిన్న పరిశ్రమలు వచ్చినప్పటికీ పదుల సంఖ్యలో మాత్రమే ఉపాధి అవకాశాలు దక్కిన పరిస్థితి ఉంది.జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది.? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్‌ ఎన్నికలకు ముందు జరిగిన పలు సభలు, సమావేశాల్లో చెప్పుకొచ్చారు. భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక నిరుద్యోగ భతి అందిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిపోయింది. నేటికీ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేక పోయింది. నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ యువతను దృష్టిలో ఉంచుకుని హామీలు గుప్పించాయి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు రేకెత్తించాయి. తాము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

➡️