ప్రజలపై విద్యుత్‌ భారాలు తగ్గించాలి : సిపిఎం

Mar 13,2025 22:49
సిపిఎం

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ప్రజలపై విద్యుత్‌ భారాలు తగ్గించాలని, సరద్దు బాటు ఛార్జీలను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. రాజమహేంద్రవరం నగరం అన్నపూర్ణమ్మ పేటలోని గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడు నెలలుగా విద్యుత్‌ ఛార్జీలుపెరిగిపోయాయని పలువురు బృందం దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్యం, డ్రెయినేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ నాయకులు బి.పూర్ణిమరాజు మాట్లాడారు. ప్రజలు అనేక సమస్యల్ని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ప్రధానంగా గత సర్కారు ఇల్లు లేని పేదలు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందన్నారు. కాని నేటికీ వారికి ఇళ్ల స్థలం చూపలేదన్నారు. ప్రసుత్తం కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదన్నారు. వెంటనే హామీ పత్రాలు ఇచ్చిన వారికి స్థలం చూపించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారన్నారు. కారణంగా ఒక్కోకుటుంబంపై రూ.500 వరకూ అదనపు భారం పడుతుందన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో కూటమి నాయకలు తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపి సర్కారు అవంబించిన విధానాలనే ఈ ప్రభుత్వమూ అమలు చేస్తుందన్నారు. ప్రజలపై భారాలు వేయడంలో రెండు ప్రభుత్వాలు ఒకే పద్ధతిని అవలంబిస్తున్నాయన్నారు. తక్షణమే ఈ భారాలను ఉపసంహరించుకోవాలన్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. పూడికతీతకు నోచుకోలేక మురుగునీరు ఎక్కడికకక్కడ నిలిచిపోతుందన్నారు. దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. వెంటనే ఈ సమస్యలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, జిల్లా కమిటీ నాయకులు కెఎస్‌వి.రామచంద్ర రావు, ఐ.సుబ్రహ్మణ్యం, డివైఎఫ్‌ఐ నాయకులు వి.రాంబాబు, రాజేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️