తుపానుతో రైతుల్లో అలజడి

Nov 30,2024 23:04
తుపానుతో రైతుల్లో అలజడి

ఫెంగల్‌ తుపానుతో రైతుల్లో అలజడి నెలకొంది. అక్కడక్కడా కురుస్తున్న భారీ వర్షాలు, గాలులకు వరి పంట నేలకొరిగింది. వరి పనలపై ఉన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రజాశక్తి-యంత్రాంగంరాజోలు డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 94,597 ఎకరాల్లో నూర్పిళ్లు పూర్తయ్యాయి. రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకున్నారు. 161 ఎకరాల్లో వరి చేలు పనల మీద ఉంది. 370 ఎకరాలకు చెందిన రాశులు కుప్పలపై ఉన్నాయి. సుమారు 60 వేల ఎకరాల్లో వరి చేలు కోతల జరగాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పొలాలకు నీటి ఎద్దడి సమస్య ఉన్నప్పటికీ రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ పంటను కంటికిరెప్పలా కాపాడుకున్నారు. నాట్లు వేసే సమయంలో వచ్చిన వర్షాలకు మొత్తం మునిగిపోయాయి. అధిక రేట్లకు నారును కొనుగోలుచేసి రెండోసారి వేశారు. నాట్లు వేసిన 20 రోజులకే మరోసారి వర్షాలు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకటికి రెండుసార్లు పంటలు దెబ్బతిని రైతులు అల్లాడిపోయారు. పంటలు పూర్తిగా దెబ్బతిని కనీసం నష్టపరిహారం కూడా అందక ఇప్పటికే అల్లాడిపోతున్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భయంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తీర ప్రాంతం మండలాలైన ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లిలో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడక్కడా వరి చేలు నేలకొరుగుతున్నాయి. ఆది, సోమ వారాల్లో కనుక వర్షాలు పడితే ఇబ్బంది ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వరి కోతలు పూర్తి చేసి పనల మీద ఉంచిన వారు, రాశులుగా పోసిన వారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని వేగంగా ఒబ్బిడి చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాకు భారీ వర్షాలు ఉండవని వాతావరణ శాఖ ప్రకటించినప్పటికీ కొద్దిపాటి వర్షం కురిసినా యంత్రాలతో కోతలకు అవాంతరాలు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్‌ డివిజన్ల పరిధిలో మూడొంతుల ప్రాంతాల్లో మాత్రం దిగుబడి 20 బస్తాలకు మించి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ఉప్పలగుప్తం, అల్లవరం, సఖినేటిపల్లి, మలికిపురం, కాట్రేనికోన మండలాల పరిధిలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వరి బాగా దెబ్బతింది. ఈ ప్రాంతంలో సుమారు 41,150 ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. కనీస పెట్టుబడులు కూడా రావని, వస్తున్న దిగుబడిలో తాలు, తప్పలు అధికంగా వచ్చే అవకాశముందని వారు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు రెండుసార్లు నారుమడులు వేయాల్సి వచ్చింది. ఇన్ని అవాంతరాలు దాటి ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని పొందుదామనుకుంటున్న రైతులకు తుపాను ప్రభావం కొత్త ఆందోళన రేకెత్తిస్తోంది. ఉప్పలగుప్తం తుపాను ప్రభావంతో ఉప్పలగుప్తం సముద్ర తీరంలో అలజడి నెలకొంది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. తీర గ్రామాలైన ఎస్‌.యానాం, వాసాలతిప్ప, ఎన్‌.కొత్తపల్లి, రాఘవులపేటలో మత్స్యకారులు చేపల వేటకు స్వస్తి పలికి ఇంటికే పరిమితం అయ్యారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తెలపడంతో కొంతమేర వరి పంటను రైతులు ఒబ్బిడి చేసుకోగా చాలావరకు వంట వరి చేలల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు యధావిధిగా పనిచేయడంతో ఎడతెరిపి లేని వర్షానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. మామిడికుదురులో ఈదురు గాలులకు పలుచోట్ల వరి పంట నేల కొరిగాయి. కోత కోసి కుప్ప నూర్చిన ధాన్యం తడవకుండా రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పారు. రామచంద్రపురంలో శుక్రవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జనసంచారం లేక మెయిన్‌ రోడ్లన్నీ వెలవెలబోయాయి. కోటనందూరు కాకరపల్లి, అల్లిపూడిలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పెనుగాలులకు అల్లిపూడిలో చెట్లు విరిగి పడుకోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అల్లిపూడి, కాకరపల్లి కోటనందూరులో వర్షంతో పంట తడిసిపోయింది. యు.కొత్తపల్లి తుపాను కారణంగా రెండు రోజుల నుండి ఉప్పాడ తీరం రాకాసి అలలు అలజడి సృష్టిస్తున్నాయి. ఉవ్వెతున్న ఎగసి పడుతున్న అలల కారణంగా ఉప్పాడ పంచాయతీ పరిధిలోని మాయాపట్నం మత్స్యకార గృహాలు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ నుండి నేమాం వరకూ అలల తాకిడికి రక్షణగా వేసిన రాళ్లు రోడ్డుపైకి చేరాయి. కాట్రేనికోన మండలంలో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సగం వంతు వరిపంట కోతలు కోసి చేలలో పనలపై ఉండగా పావు వంతు భాగం ధాన్యం కల్లాలలో రాశులుగా పడివుంది. పనలు చేలపై ఉండడంతో అవి తడిసిపోయి మొక్క మొలిచే పరిస్థితి ఏర్పడింది. ఆత్రేయపురంలో ఈదురు గాలులకు అక్కడక్కడా వరి పంట పొలాలు నేలకొరిగాయి. ముమ్మిడివరంలో ధాన్యంపు రాశులు తడిసి ముద్దయ్యాయి.

➡️