ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ పిల్లల్లో రక్తహీనత, బరువు, ఎదుగుదల లేని పిల్లలకు బంగారు కొండ ప్లస్ కిట్లు పంపిణీ చేసి, పిల్లల ఆరోగ్యం మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ సిడిపిఒలు, సూపర్‌వైజర్లతో కలెక్టర్ బంగారు కొండ ప్లస్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీలో తాను చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తామని తెలిపారు. కమిటీ సభ్యులుగా డిఆర్‌డిఎ పీడీ, సివిల్ సప్లైస్ డిఎం, డిపిఒలను నియమించామన్నారు. ఈ కమిటీ కన్వీనర్‌గా మహిళా మరియు సంక్షేమ శాఖ అధికారి వ్యవహరిస్తారని తెలిపారు. బంగార కొండ ప్లస్ కిట్లో తేనె, నెయ్యి, రాగి పిండి, వేరుసెనగ చిక్కి, బెల్లం, పెసరపప్పు, కందిపప్పు ఉంటాయని తెలిపారు. బంగారు కొండ ప్లస్‌లో ఉన్న పిల్లలందరినీ పిల్లల బరువు పెరుగుతున్నారో లేదో వారానికి ఒకసారి పరిశీలించాలని తెలిపారు. రెండు నెలల వరకు చూసి బరువులో మార్పు రాకపోతే తగిన వైద్యం చేయించి, పిల్లలు ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా చర్య తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలందరూ పిల్లలు బరువులు పెరుగుతున్నారో లేదో సక్రమంగా చూడాలని తెలిపారు. బరువు పెరగని పిల్లలకు మెడికల్ చెకప్ చేయించి, వారి ఆరోగ్యం మెరుగు పరిచే విధంగా చూడాలన్నారు. పిల్లలు రక్తహీనతను పూర్తిగా నివారించేందుకు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరగా ఉన్న అంగన్‌వాడీ సెంటర్స్‌కు దగ్గర చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా స్త్రీ సంక్షేమ శాఖ పీడీ కె.విజయ కుమారి, నోడల్ ఆఫీసర్ కె.నాగలక్ష్మి పాల్గొన్నారు.
