‘యువత పోరు’లో వైసిపి నాయకుల డిమాండ్
ప్రజాశక్తి – రాజమహేంద్రరం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ భేషరతుగా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేవారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా బుధవారం బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించామన్నారు. టిడిపి అబద్దాల పుట్టనే విషయాన్ని ప్రజలు గుర్తించార న్నారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భతి విడుదల చేయాలన్నారు. వైసిపి సర్కారు అప్పుల వల్లే సూపర్ సిక్స్ అమలు చేయలేక పోతున్నానని ముఖ్యమంత్రి చెప్పడంలో అర్థం లేదన్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండిస్టీ అని చెప్పుకునే బాబు గారి అనుభవం అంతా ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదన్నారు. హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ చేపట్టిన ఫీజు రియింబర్స్‌మెంట్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నతులుగా ఎదిగారన్నారు. అటువంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తక్షణం ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలన్నీ విడుదల చేయాలన్నారు. తొలుత యువ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే మార్గాని ఎస్టేట్స్ నుంచి మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి తానేటి. వనిత, వైసిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎంఎల్‌ఎలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి, చందన నాగేశ్వర్, గిరిజాల బాబు తదితరులు పాల్గొన్నారు.
