ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గల పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో గురువారం ఘనంగా జరిగింది. స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారం, నూతన దుస్తులు, కాస్మొటిక్స్‌ను నిర్వాహకులు డాక్టర్ గుబ్బల రాంబాబు అందించారు. నగరపాలక సంస్థ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవిఆర్.మూర్తి, పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించారు. నగరపాలక సంస్థ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రం నిర్వహిస్తున్నట్లు రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో నిరాశ్రయ కేంద్రం సిబ్బందితోపాటు సుమారు 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. రాంబాబు మాట్లాడుతూ నిరాశ్రయ కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలో సుమారు 5 వేలకు పైబడి నిరాశ్రయులు తలదాచుకుంటున్నారన్నారు. అనంతరం 200 మంది నిరాశ్రయులతో ర్యాలీ నిర్వహించారు. మరిన్ని నిరాశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్‌రావు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మహ్మద్ ఖాన్, డాక్టర్ పి.దేవానంద్, నిరాశ్రయుల కేంద్రం మేనేజర్ ఎద్దు హరికృష్ణ, పి.మీరాకుమారి, దివ్య పాల్గొన్నారు.
