ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ జీవిత సత్యాలను పద్యాల రూపంలో అందించిన మహోన్నత యోగి వేమన అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు కొనియాడారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం ఉదయం యోగి వేమన జయంతి వేడుకల సందర్భంగా యోగి వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెసి ఎస్.చిన్న రాముడు మాట్లాడారు. యోగి వేమనకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు. వేమన ఎన్నో భోగ భాగ్యాలు అనుభవించి, అవి ఏవీ జీవిత సత్యాలు కాదని తన రచనలు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. తన రచనల ద్వారా గొప్ప తెలుగు తత్వవేత్త, కవిగా, ఆయన కవితలు తెలుగులో సరళమైన భాష, స్థానిక యాసలను ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్కరికీ దగ్గర అయ్యాయన్నారు. వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదన్నారు. ఆయన రచనల ద్వారా జీవితా సత్యాలను తెలుసుకుని భావితరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ్మూర్తి, జిల్లా బిసి సంక్షేమ అధికారి బి.శశాంక, కలక్టరేట్ ఎఒ ఎండీ ఆలీ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
