ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి మత్తుకి అలవాటు పడిన కొంతమంది యువతే లక్ష్యంగా జిల్లాలో గంజాయి అమ్మకాలు గుట్టుచప్పుడు కాక జోరుగా సాగుతున్నాయి. సిగరెట్లు, మద్యం తాగడం ఫ్యాషన్‌గా భావించిన కొందరు ఇప్పుడు గంజాయిని మత్తుగా ఎంజారు చేస్తున్నారు. చదువుకున్న యువత సైతం వీటికి బానిసగా మారి బంగారు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలే కాక పట్టణ కేంద్రాల్లో కూడా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోనే ఈ సంస్కతి చాపకిందనీరులా పెరిగిపోతోంది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలు అడ్డాలుగా మారాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీనిపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. పాత నేరస్తులే సూత్రధారులుగా విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఏజెన్సీ మీదుగా జిల్లాలోకి గంజాయి రవాణా అవుతున్నట్టు తరచూ పోలీసులు గుర్తిస్తూ అరెస్టులు చేస్తున్నారు. రైలు, బస్సుమార్గం, వ్యాన్లు, ఆటోలు ద్వారా దిగుమతి సాగుతోంది. రైళ్లు, బస్సుల సీట్ల కింద నిషేధిత మత్తు పదార్థాలు గల బ్యాగు పెట్టి వ్యక్తులు దూరంగా నిల్చొని గమనిస్తూ ఉంటారు. గంజాయి విక్రేతకు, కొనుగోలుదారుడికి ఆ సమయంలో సంబంధం ఉండదు. ఫలానా సీటు కింద బ్యాగులో గంజాయి ఉందని సమాచారం అందుకున్న వ్యక్తి వారి ఊరు రాగానే వాటిని తీసుకువెళతారు. ఇలా అక్రమ మార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.యథేచ్ఛగా గంజాయి విక్రయాలు జిల్లాలో కళా శాలల విద్యార్థులు, ఏ పనీ లేకుండా తిరుగుతున్న వారిని టార్గెట్ చేసుకుని గంజాయి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వారికి మత్తు పదార్థాలను అలవాటు చేసి రూ.వేలల్లో సొమ్ములు దండుకుంటున్నారు. రకరకాల వ్యక్తులు ప్రయాణికుల్లా వచ్చి కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లకు గంజాయి చేరుస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోంది. అక్కడి నుంచి అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇదంతా అధికారుల కంట పడటం లేదు. ఎప్పుడైనా ఎవరైనా సమాచారం అందిస్తే వాటిపైనే దాడులు చేసి పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నా అడ్డుకట్టపడటంలేదు. ఉక్కుపాదం మోపుతున్నా ఆగని దందాగత సెప్టెంబరులో కొత్తపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు స్థానికంగా ఒక క్రీడా స్థలంలో గంజాయి తాగుతుండగా ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబరులో ప్రధాన రైల్వే స్టేషన్ గూడ్స్ గేటు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు యువకులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది ఆనంద్ నగర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు కాతేరు గామన్ వంతెన సమీపంలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి తాగుతుండగా మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశౄరు. వారి వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గామన్ వంతెన వద్ద సర్వీసు రోడ్డుపై ఒక ఆటోలో గంజాయిని తరలిస్తుండగా ఇద్దరు యువలకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి ఘటనలు ప్రతి నెలా నిత్యకృత్యంగా మారాయి.
