ఇళ్ల స్థలాలు చూపించాలి

Mar 8,2025 23:17
ఇళ్ల స్థలాలు చూపించాలి

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఇళ్ల పట్టాలు(హామీ పత్రాలు) ఇచ్చిన వారికి ఇంటి స్థలం చూపించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. నగరంలోని అంబేద్కర్‌ నగర్‌లో చేపట్టిన యాత్రలో స్థానికులు పలు సమస్యలను బృందం దృష్టికి తీసుకొచ్చారు. పట్టాలిచ్చారు గాని స్థలాలు నేటికీ చూపించలేదని లబ్ధిదారులు వాపోయారు. పట్టాలిచ్చిన వారికి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.1.80 లక్షలు మాత్రమే సాయం అందించారన్నారు. ఈ మొత్తంతో ఇంటి నిర్మాణం ఎలా పూర్తవుతుందని వాపోయారు. దీంతో ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ బిల్లుల భారాలను పలువురు సిపిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడారు. ప్రజలు అనేక సమస్యల్ని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వీటిలో ప్రధానంగా గత వైసిపి ప్రభుత్వం నగరంలో సుమారు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా నేటికీ వాటికి స్థలం చూపించలేదని తెలిపారు. వెంటనే హామీ పత్రాలు ఇచ్చిన వారికి స్థలం చూపించాలని డిమాండ్‌ చేశారు. వెలుగుబందలో పట్టాలిచ్చిన వారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన సాయం పునాదులకే సరిపోయిందన్నారు. ప్రభుత్వ సాయం ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోక వేలాదిమంది ఇంటి నిర్మాణం ప్రాథమిక స్థాయిలో, మరి కొద్ది మంది సగంలో నిలిపిశారని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం రూ.5లక్షల సాయం అందించాలన్నారు. టిడ్కో గృహాలు అర్హుల జాబితాలో ఉన్న వారందరికీ కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం తీవ్రంగా మోపుతోందన్నారు. గత ప్రభుత్వం మోపిన ట్రూఅప్‌ ఛార్జీల బారాన్ని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. దీనివల్ల సగటున రూ.200 నుంచి రూ.500 ప్రతి కుటుంబంపై నెలకు అదనంగా భారం పడుతోందన్నారు. స్మార్ట్‌ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రజలపై విద్యుత్‌ భారాలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.పవన్‌, జిల్లా కమిటీ సభ్యులు కెఎస్‌వి.రామచంద్రరావు, బి.పూర్ణిమరాజు, సిపిఎం నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, నగర కమిటీ సభ్యులు రాంబాబు, నాయకులు తాతారావు, రాజేష్‌, భాస్కర్‌, మహేష్‌ పాల్గొన్నారు.అడవిని తలపిస్తున్న టిడ్కో గృహాలు రాజమహేంద్రవరం రూరల్‌ : ధవళేశ్వరంలోని టిడ్కో గృహాలు అడవిని తలపిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ విమర్శించారు. సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ధవళేశ్వరం సమీపంలోని టిడ్కో, వాంబే గృహాలను వారు సందర్శించారు. ఎ,బి, సి బ్లాకుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు స్థానికులు సమస్యలను వివరించారు. తము మూడేళ్ల నుంచి ఉంటున్నామన్నారు. చుట్టూ తుప్పలతో అడవిలో నివశిస్తున్నట్టు ఉంటుందన్నారు. ఏ బ్లాక్‌ చూసిన దట్టమైన తుప్పలతో నిండిపోయిందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. విద్య, వైద్యం కోసం రాజమండ్రి నగరానికి పరుగులు తీయాల్సి వస్తుందని వాపోయారు. డ్రెయినేజీ ఇక్కడ ప్రధాన సమస్యగా ఉందన్నారు. డ్రెయినేజీ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. తాగునీటి సౌకర్యం లేదన్నారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడారు. టిడ్కో వాసులకు వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మంచినీటి కోసం వాటర్‌ ట్యాంకులు రెండు రోజులకు ఒకసారి ఇస్తున్నారని, వేసవి నేపథ్యంలో తాగునీటి వసతిని ఏర్పాటు చేసేవరకూ ప్రతి రోజూ నీటిని సరఫరా చేయాలన్నారు. తుప్పల వల్ల పాముల బెడద ఎక్కువైందని, వెంటనే జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించాలన్నారు. తాగునీటి ట్యాంకును వెంటనే పూర్తి చేయాలన్నారు. సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను ఇల్లు లేని పేదలకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె.రామకృష్ణ, ఐ.సుబ్రహ్మణ్యం, కె.రామసుందర్రావు, ఎస్‌ఎస్‌.మూర్తి, పేరయ్య లింగం, ప్రకాష్‌, రాంబాబు రాజేష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

➡️