ప్రజాశక్తి – ఉండ్రాజవరం
మండలంలో రహదారులు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ఇలాంటి రోడ్లపై ప్రయాణాలు సాగించడం ఎలా అని ఆయా ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చివటం శ్రీ సాయి అంబిక న్యూ టవర్స్ ఎదురు రోడ్డు పెద్దపెద్ద గుంతలతో దర్శనమిస్తోంది. అలాగే కాల్దారిలోని అండర్‌పాస్ బ్రిడ్జివద్ద చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతోంది. ఇక్కడ కూడా రహదారి శిథిలమైంది. తాడిపర్రు రోడ్డు, ఉండ్రాజవరం ప్రధాన రహదారి, పాలంగి మెయిన్ రోడ్డు, మోర్త ప్రధాన రహదారి ఇలా మండలంలో ప్రతి ప్రధాన రహదారి గుంతలతో దర్శనమిస్తున్నాయి. గుంతలో వర్షపు నీరు చేరి నీటి మడుగులను తలపిస్తున్నాయి. వాహదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం ఎక్కడోఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తరచూ కురుస్తున్న భారీ వర్షాల వల్ల రహదారలుఉ మరింత ఛిద్రంగా మారి నడిచేందుకు కూడా వీలులేకుండా పోతోంది.
రోడ్లకు కనీసం మరమ్మతులు అయినా నిర్వహించాలని శ్రీ సాయి అంబిక న్యూ టవర్స్ నివాసితులు, పరిసర ప్రాంత వాసులు కోరుతున్నారు. రోడ్ల దుస్థితిపై ఆ ప్రాంతానికి చెందిన దండు ప్రకాష్‌రాజు, జంపన వెంకటరామరాజు, తూము బ్రహ్మానందం, కూర్మాల సత్యవెంకటకృష్ణయ్య, కూరగాయల వ్యాపారి మట్ట లక్ష్మి, కిరాణాషాపు యజమాని కూర్మాల నాగసత్యవతి తదితరులు రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ఇటీవల ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ వచ్చారని, ఆనకు సైతం తమ సమస్యను విన్నవించామన్నారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.