అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలి : యుటిఎఫ్

Dec 4,2024 22:53
అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలి : యుటిఎఫ్

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌ విద్యాశాఖ అధికారుల అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘నిరసన ప్రదర్శనలు’ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి రమేష్‌ తెలిపారు. ఈ మేరకు రూరల్‌ ఎంఇఒను బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ ఈ నెల 11న అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వద్దా నిరసన ప్రదర్శనలు, 16న రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పరిపాలనకు, ఈ ప్రభుత్వ పరిపాలనకు పెద్దగా తేడా లేదనే విధంగా విద్యాశాఖ అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని అన్నారు. పాఠశాలల పనివేళల పెంపు, 10 శాతం మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదనే ఆంక్షలు, 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌, విద్యార్థులు వివరాలు అపార్‌లో నమోదు, ఇలా ప్రతి నిర్ణయం అసంబద్ధంగానే ఉంటున్నాయని తెలిపారు. ముఖ్యంగా మండలాల్లో 10 శాతం మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని ఎంఇఒలు అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు మంజూరు చేయడం లేదన్నారు. ఆనారోగ్యం బారిన పడినవారికి సైతం సెలవులు మంజూరు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే విద్యార్థుల అపార్‌ నమోదు విషయంలో పలు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్లో ఆదివారాలు, పండుగ దినాల్లో సైతం పనిచేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఈ అసంబద్ధ నిర్ణయాలు ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. విద్యాశాఖ అసంబద్ధ నిర్ణయాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో యుటిఎఫ్‌ రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ అధ్యక్షులు జనార్ధన్‌, కార్యదర్శి శ్రీనివాస్‌ కోశాధికారి అనిల్‌, ప్రకాష్‌, నానాజీ, సత్యనారాయణ, సరోజిని, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️