బడి బస్సు భద్రమేనా..?

Jun 9,2024 23:39
బడి బస్సు భద్రమేనా..?

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిపాఠశాలల ప్రారంభం సమీపిస్తున్న వేళ బడి బస్సులు భద్రమేనా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. మరో వారం రోజుల్లో బడులు ప్రారంభం కానున్న విషయం విదితమే. ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులను గ్రామాల నుంచి పిల్లలను పట్టణంలోని పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. విద్యార్థులను రవాణా చేసినందుకు రవాణా ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. విద్యాసంస్థల యజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా బస్సులను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలుమార్లు విద్యాసంస్థలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. బస్సు సీట్లకు మించి విద్యార్థులను ఎక్కువగా చేరవేస్తున్నాయి. అయితే బస్సుల ఫిట్‌నెస్‌ను డ్రైవర్‌ కండీషన్‌ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి బస్సులపై దష్టి సారించి పిల్లలకు ఎలాంటి ఆపద ఏర్పడకూడదని ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఫిట్‌నెస్‌కు సంబంధించిన పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అందుకుగాను ప్రతి సంవత్సరం బస్సులకు అందించే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ స్కూల్సు ప్రారంభానికి ముందే ముగిసేట్లుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతీ సంవత్సరం అధికారులు బస్సులు ఎంత మేర ఫిట్‌నెస్‌ ఉన్నాయనే దానిపై తనిఖీలు చేస్తూ విద్యాసంస్థల పునఃప్రారంభం వరకు సర్టిఫికెట్లను జారీ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఫిట్‌నెస్‌ చర్యల్లో భాగంగా విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్‌ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన బస్సులు మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభంతల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు పాఠశాల భవనాలకు రంగులు వేస్తూ అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ యాజమాన్యాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్‌నెస్‌పై మాత్రం దష్టి పెట్టడం లేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కావడం అప్పటిలోగా అన్ని బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ నిర్వహించడం అంత ఈజీ కాదు. మరోవైపు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ కావడానికి వాహనాలకు తాత్కాలికంగా మరమ్మతు నిర్వహించి మమ అనిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతేడాది ఫిట్‌నెస్‌ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్నా ఫిట్‌నెస్‌ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గడువు ముగిసినా విద్యా సంస్థల బస్సులు యథేచ్చగా తిరుగుతున్నాయని అధికారులు మాత్రం స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సారైనా యాజమాన్యాలు పాఠాలు నేర్చుకుంటాయా.. ధనార్జనే ధ్యేయంగా అర్హతలేని బస్సులకు మెరుగులు దిద్ది దర్జాగా తిప్పుతారా అన్న సందేహాలు విద్యార్థి సంఘ నాయకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.ఫిట్‌నెస్‌ పరీక్షలపై నిర్లక్ష్యంబడి బస్సు ఫిట్‌నెస్‌ అర్హత సాధించాలంటే అనేక నిబంధనలున్నాయి. కానీ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లు వదలుతున్నారన్న ఆరోపణలున్నాయి. పాత బస్సులకు కొత్త రంగులద్ది బస్సులను నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రవాణాశాఖ నిర్ధేశించిన ప్రమాణాలను యాజమాన్యలు పట్టించుకోవడం లేదని విమర్శలు లేకపోలేదు. జిల్లాలో రవాణాశాఖ అధికారిక లెక్కల ప్రకారం 700లకు పైగా బడి బస్సులున్నాయి. అందులో జిల్లా కేంద్రానికి చుట్టు పక్కల ఉన్న మండలాల్లోనే ఎక్కువగా పాఠశాలలు ఉండడం ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించకుండా గడువు చివరి వరకు వేచి ఉండి హడావుడిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్ల్లు సమాచారం. అందుకు ఉదాహరణనే ఆర్‌టిఎ కార్యాలయంలో నమోదైన ఫిట్‌నెస్‌ బస్సుల సంఖ్య వివరాలు ఏటా పాఠశాల పునఃప్రారంభం నాటికి ఫిట్‌నెస్‌ కోసం బస్సులను రవాణా శాఖ కార్యాలయానికి తీసుకెళ్తున్నా విద్యా సంస్థల నిర్వాహకులు వారికి సంబంధించిన ఏజెంట్ల ద్వారానే బడిబస్సును ఫిట్‌నెస్‌కు తీసుకె ళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు అందిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రమాణాలపై అనుమానాలెన్నో..బడి బస్సుల ప్రమాణాలపై ప్రతి ఏడాది లాగానే.. ఎన్నో అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పాటిస్తున్నాయా.. లేదా.. ఒకవేళ ఫిట్‌నెస్‌ లేకపోయినా అధికారులు చూసీచూడనట్లుగా వదిలేసి వాటికి గ్రీన్‌సిగల్‌ ఇస్తున్నారా…? అనే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సరిగా లేని బస్సులకు చిన్న చిన్న మరమ్మతులు చేసి రంగులు వేసి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఫిట్‌నెస్‌ పరీక్షలకు పంపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వారం రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ పరీక్షలపై పూర్తి స్థాయిలో దష్టి సారించని అధికారులు హడావుడిగా ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాటి ప్రమాణాలపై అధికారులు పకడ్బందీగా వ్యవహరించాల్సిందేనని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.

➡️