కదం తొక్కిన కార్మిక, రైతు సంఘాలు

Nov 26,2024 23:11
కార్మిక సంఘాలు

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి
కేంద్రంలోని మోడీ నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ శ్రేణులు కథం తొక్కాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ నుంచి కోటగుమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కనీస వేతనం రూ.26వేలు చేయాలని, కార్పొరేట్‌ అనుకూల విధానాలు నశించాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందర్‌బాబు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కొండలరావు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు కె.జోజి, ఇఫ్టూ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. పెట్టుబడిపై 50శాతం అదనంగా నిర్ణయించి గిట్టుబాటు ధరను ప్రకటించాలని, ఈ మేరకు చట్టం చేయాలన్నారు. ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలన్నారు. 60 ఏళ్లు పనిచేసి రిటైర్‌ అయిన వారికి రూ.9 వేలు కనీస పెన్షన్‌ చెల్లించాలన్నారు. ఆటో, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్‌, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీ, ఆశ, మిడ్డే మీల్స్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్‌ చేయాలన్నారు. గ్రాడ్యుటీ, పెన్షన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను తక్షణం నిలిపేయాలన్నారు. ప్రజలపై విద్యుత్‌ భారాలు పెంచే 2023 విద్యుత్‌ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. అత్యవసర మందులపై జిఎస్‌టిని ఎత్తి వేయాలన్నారు. ధరలు తగ్గించేందుకు పెట్రోల్‌, డీజిల్‌లపై పన్నులను తగ్గించాలన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, అప్పటివరకు సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేయాలన్నారు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను అన్నీ రద్దు చేసుకోవాలన్నారు. స్మార్ట్‌ మీటర్ల బిగింపును తక్షణం నిలుపుదల చేయాలని, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు రెగ్యులర్‌గా సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలన్నారు. మూసివేసిన పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.మూర్తి, జిల్లా సహాయ కార్యదర్శి కె.రామకృష్ణ, బి.పూర్ణిమరాజు జిల్లా నాయకులు బి.పవన్‌, ఎఐటియుసి నాయకులు కె.రాంబాబు, తాటిపాక మధు, రైతు సంఘం కార్యదర్శి కె.జ్యోతిరాజు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి గారపాటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోట లక్ష్మణరావు, కార్మిక మహిళా పొలం నాయకులు లావణ్య, ఎపి అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బేబిరాణి, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి, జిల్లా గ్యాస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి గంటి కృష్ణ, తూర్పుగోదావరి జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వల్లేపల్లి నరసింహమూర్తి, పెన్షన్‌ అసోసియేషన్‌ నాయకుల సిహెచ్‌.మోహన్‌రావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.భాస్కర్‌, ఎన్‌.రాజా, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ పి.రాంబాబు, జోసఫ్‌, జట్ల కార్మిక సంఘం కార్యదర్శి సప్పా రమణ, ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు కోరాడ అప్పారావు, ఎఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షులు జె సత్తిబాబు, ఐఎఫ్‌టియు జిల్లా కోశాధికారి దినేష్‌ బాబు, జిల్లా కార్యదర్శి ఎస్‌.కిరణ్‌ కుమార్‌, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, ఎడ్ల లక్ష్మి, స్వేని, రమణమ్మ, భద్ర రావు తదితర నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

➡️