పలుచోట్ల అంగన్‌వాడీల నిర్బంధం
ప్రభుత్వ తీరుపై అంగన్‌వాడీల ఆగ్రహం
కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా
అంగన్‌వాడీలు చేపట్టిన చలో విజయవాడపై ప్రభుత్వం నిర్భందకాండకు దిగింది. ముందస్తుగా సంబంధిత అధికారులకు అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ధర్నాకు విజయవాడ వెళ్తున్నట్లు వినతిపత్రాలు అందించారు. ప్రభుత్వ ఒత్తిడితో ఐసిడిఎస్ అధికారులు, సూపర్‌వైజర్లు సెక్టార్ మీటింగ్‌ల పేరుతో అంగన్‌వాడీలను చలో విజయవాడకు వెళ్లకుండా కుట్రలు సాగించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీలు వీరి కుట్రలను ఎదుర్కొని విజయవాడకు తరలివెళ్లారు. తుని, సామర్లకోట ప్రాంతాల్లో అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల ఒత్తిడితో సెక్టార్ మీటింగ్‌లకు హాజరైన అంగన్‌వాడీలు అక్కడే తమ నిరసనను వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి – యంత్రాంగం
కాకినాడ కనీస వేతనాల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన 42 రోజుల సమ్మె సందర్భంగా తెలుగుదేశం నేతలు న్యాయమైన కోర్కెలను తీర్చుతామని నాడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని కోరిన అంగన్‌వాడీలను అరెస్టు చేయడం దారుణమని సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలు దేరిన అంగన్‌వాడీలను తుని, సామర్లకోట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కచేరిపేట సుందరయ్య భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, శంఖవరం రాజేశ్వరి, పిఠాపురం గంగాభవాని మాట్లాడుతూ చారిత్రక 42 రోజుల అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని వారు తప్పుపట్టారు. బతికుండగా వేతనాలు పెంచకుండా, చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని అంగీకరించి, రూ.15 వేలే చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు అంగన్‌వాడీలకు గ్రాడ్యుటి చట్టాన్ని అమలు చేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేదిలేదన్నారు. సెంటర్ అద్దెలు, వంట ఖర్చులు నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే రూ.11వేల వేతనం వీటికే సరిపోతుండగా, కుంటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మొబైల్ యాప్ పని భారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యుటి చట్టాన్ని అమలు చేయాలని, మినిట్స్‌లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధికారి మలకా రమణ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, అంగన్‌వాడీలు సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాజులూరు మండలంలోని కాజులూరు, గొల్లపాలెం సెక్టార్ల పరిధిలో అంగన్‌వాడీలను సూపర్‌వైజర్లు సెక్టార్ మీటింగ్ పేరుతో అడ్డుకున్నారు. చలో విజయవాడపై పోలీసులు నిర్భంధాన్ని ప్రయోగించడంతో కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు సైతం వెళ్లకుండా సూపర్‌వైజర్లు అంగన్‌వాడీలతో ధర్నాకు వెళ్లమని వారితో సంతకాలు పెట్టించుకుని అడ్డుకున్నారు. దీంతో అంగన్‌వాడీలు సెక్టార్ మీటింగ్ వద్దే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సెక్టర్ లీడర్ హనుమావతి మాట్లాడుతూ కాకినాడలో జరిగే ధర్నాకు సైతం వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లపాలెం కోలంక సెక్టర్ లీడర్లు వరలక్ష్మి, అన్నవరం అంగన్‌వాడీలు సలాది లక్ష్మి, నందికోళ్ల నాగమణి, మాత శేషారత్నం, మామిడి ప్రసన్న, కె.అరుణ పాల్గొన్నారు. సామర్లకోట స్థానిక రైల్వే స్టేషన్ వద్ద సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ సిబ్బందితో కలిసి అంగన్‌వాడీలను అడ్డుకున్నారు. చలో విజయవాడ వెళ్లకుండా వారిని అడ్డగించి వెనుకకు పంపివేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అంగన్‌వాడీలను గృహానిర్బందాలకు, అరెస్టులు చేయడం దారుణమన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే వైసిపికి పట్టిన గతే కూటమి పార్టీలకు పడుతుందని హెచ్చరించారు. శంఖవరం ఛలో విజయవాడ బయలు దేరిన అంగన్‌వాడీలను ఆదివారం రాత్రి అన్నవరం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. తమ న్యాయం చేయాలని కోరుతున్న తమను అడ్డుకోవడం దారుణమని అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు బుల్లెమ్మ అన్నారు. పెరవలి : చలో విజయవాడ నేపథ్యంలో మండలంలోని అంగన్‌వాడీలపై పోలీసులు నిర్బంధం విధించారు. పెరవలి ఐసిడిఎస్ పరిధిలోని నిడదవోలు, పెరవలి మండలాల నుండి సుమారు 150 మంది అంగన్‌వాడీలు రైళ్లు, బస్సులపై విజయవాడకు పయనమయ్యారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో కొంత మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి బస్సుల్లో వెళ్తున్న అంగన్‌వాడీలను కిందకు దింపేశారు. వారిని చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
