ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సంక్రాంతి పండుగ వచ్చింది. అధిక ధరలకు వినోదాన్ని కొనుక్కోవాల్సి వస్తోంది. అన్ని వర్గాల ప్రజలను అలరించే సినిమా ఇప్పుడు సగటు ప్రేక్షకులకు బహు భారంగా మారింది.టిక్కెట్ల ధరలు చుక్కల్ని తాకుతుండడంతో జేబులు గుల్లవుతున్నాయి. యాజమాన్యాలు యథేచ్ఛగా ‘బ్లాక్’ టిక్కెట్ల దందా కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 140 సినిమా థియేటర్లు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అనుశ్రీ, సురేష్ ప్రొడక్షన్స్ యాజమాన్యాలు కొన్ని థియేటర్లను లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రేక్షకులకు సినిమా భారంగా మారిందనే చెప్పవచ్చు. కొత్త సినిమా విడుదలయిందంటే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో అనేక మంది సెలవులపై ఆయా ఊళ్ళు వెళుతుంటారు. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తారు. ఈ సందర్భంలో సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో యాజమాన్యాలు వారి అవసరాలను ఆసరాగా చేసుకుంటూ టిక్కెట్లను యథేచ్ఛగా అధిక ధరలకు అమ్ముతున్నారు. రూ.100 అమ్మే ఒక్కో టిక్కెట్ ధర రూ.250 నుంచి రూ.350 కూడా కౌంటర్ల వద్దే విక్రయిస్తున్నారు. మల్టీ ఫ్లెక్స్, ఐనాక్స్ వంటి పెద్ద పెద్ద థియేటర్లలో సినిమాలు చూడాలంటే సామాన్య ప్రజలకు అందని ద్రాక్ష మాదిరిగానే ఉంటున్నాయి.సీజన్, సినిమాకొక ధరసినిమాను, హీరో, సీజన్ డిమాండ్‌ను బట్టి టిక్కెట్ల ధరలను పెంచుతున్నారు. బ్లాక్ టిక్కెట్ ధరలు మరింత పెంచుతున్నారు. ఇటీవల విడుదలైన అగ్ర హీరోల సినిమా టిక్కెట్ల ధరలు ఏకంగా రూ.300, రూ.500కు విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో అయితే రూ.600 నుంచి రూ.8000పై మాటే. మాములు సినిమాలైదే రూ.300 వరకూ అమ్ముతున్నారు. వారాంతాలు, పండుగ సీజన్లలో ఒక కుటుంబం సినిమాకు కనీసం రూ.2 వేలు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టిక్కెట్‌ను రూ.1000 నుంచి రూ.1200కి విక్రయించారు. అభిమానం పేరుతో సామాన్య ప్రేక్షకులు సైతం ఈ షో టికెట్లను కొనుగోలు చేసి సినిమాలను చూస్తుండడం గమనార్హం. రెండు రోజుల క్రితం విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకు కూడా ఫ్యాన్స్ పేరుతో రూ.1000 పైనే టిక్కెట్టు ధర వసూలు చేశారు. మొదటి వారం రోజులు రూ.300 వరకు టిక్కెట్ కౌంటర్లోనే విక్రయిస్తున్నారు. వారం తర్వాత రూ.250కి టిక్కెట్ ధర ఉంటుందని పలు థియేటర్ల యజమానులు తెలిపారు.అధికారికంగానే ‘బ్లాక్’ దందా పండుగలు, సెలవులు,వారంతాలు వంటి ప్రత్యేక రోజుల్లో బ్లాక్ టిక్కెట్ల ధరల విక్రయం విచ్చలవిడిగా సాగుతోంది. థియేటర్ల ప్రాంగణంలోనే ఈ దందా జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్ల సిబ్బందే టిక్కెట్లను అధిక ధరలకు అమ్ముతున్నా పోలీసులు కూడా పట్టనట్లు వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పలు చోట్ల అదేమని ప్రశ్నిస్తున్నా ప్రేక్షకులకు చేదు అనుభవం ఎదురవుతోంది.ఆన్‌లైన్‌లోనూ అదే తీరుథియేటర్లలో మాదిరిగానే ఆన్‌లైన్ లోనూ రెండు రకాలుగా టిక్కెట్లను అమ్ముతున్నారు. ఫస్ట్ క్లాస్ రూ.250, సెకండ్ క్లాస్ రూ.200 గా విక్రయాలు సాగిస్తున్నారు. ఆయా థియేటర్లను బట్టి వీటి ధరలు పెరుగుతాయి. 50 శాతం టిక్కెట్లను మాత్రమే ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడతారు. మిగిలినవి కౌంటర్‌లో విక్రయించాలి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ప్రేక్షకుడి ఫోటో టిక్కెట్‌పై నిబంధనల ప్రకారం ముద్రించాల్సి ఉంటుంది. ఎక్కడా ఇది అమలు కావడం లేదు. ఒకే వ్యక్తి పేరుతో నాలుగు టిక్కెట్ల వరకూ బుక్ చేస్తున్నారు. అలా బుక్ చేసిన టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మకాల జరుపుతున్నారు.తిను బండారాలు, పార్కింగ్ కు అధిక వసూళ్లుథియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌కు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిఒ నెంబర్ 63 ప్రకారం పార్కింగ్‌కు ఎటువంటి రుసుమూ వసూలు చేయరాదని నిబంధనలు ఉన్నాయి. కానీ బైకుకు రూ.20, కారుకు రూ.40 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. తిను బండారాలదీ అదే పరిస్థితి. కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, సమోసా, కూల్ కేక్, టీ, కాపీ, వంటి ధరలు అధిక ధరలకే విక్రయిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో పెద్ద థియేటర్లలో రెండు సమోసాలు రూ.100, పాప్ కార్న్ రూ.150, టీ, కాఫీల ధరలు రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. ఈ దోపిడీపై సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం.