వివాహం.. వ్యయ భరితం..

Feb 7,2025 23:58

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పెళ్లిపై ధరల మోత మోగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వివాహ సామగ్రికి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రతి కుటుంబం తమ కుటుంబంలో జరగబోయే వివాహాన్ని మధురజ్ఞాపకంగా భావించటం పరిపాటి. ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేయాలని ఆరాట పడతారు. కాగా.. ప్రస్తుతం పెళ్లిళ్లకు ధరల సెగ తగులుతుండడంతో వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసరాల వస్తువుల నుంచి, కల్యాణ మండపాలు, బ్యాండు మేళాలు, డెకరేషన్‌ సామగ్రి.. ఇలా అన్నింటా ధరలు రెట్టింపయ్యాయి. అంచనాలకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో నిర్వాహకులు సతమతం అవుతున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేనెల 21 వరకు కొనసాగనుంది. జిల్లాలో ఈ నెలన్నర వ్యవధిలో సుమారు 10 వేల వివాహాలు జరుగనున్నట్టు అంచనా. ఉమ్మడి జిల్లాలో సుమారు 600లకు పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి. సామర్థ్యం సౌకర్యాల ఆధారంగా ఒక్కో కల్యాణ మంటపానికి రోజుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు వరకు అద్దెలు వసూలు చేస్తున్నారు. తమ దగ్గరే భోజనాలు, టిఫిన్‌, పూల అలంకరణ తదితరాలు తీసుకోవాలని షరతులు సైతం విధిస్తున్నారు. పెళ్లి ఖర్చులో సుమారు 20 శాతం మంటపాల అద్దెలకు చెల్లించక తప్పడం లేదు.దుస్తులు, ఇతర కానుకలపై ధరాభారం పెండ్లి కుమార్తె, కుమారుడితో సహా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం దుస్తుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చుకు సిద్ధమవుతున్నారు. బంధువులకు కానుకలుగా దుస్తులు అందజేస్తున్నారు. కొంతకాలంగా వస్త్రాలపై జిఎస్‌టి కూడా విధిస్తుండటంతో ధరలు మరికాస్త పెరిగిపోయాయి. వివాహంలో కేవలం వస్త్రాలకే రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చువుతోంది. వివాహ సమయంలో బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి తీసుకోవడం ఆనవాయితీ. సామాన్య మధ్యతరగతి ఇళ్లలోనే వీటన్నింటి ఖర్చు గతంలో సుమారుగా రూ.మూడు లక్షలు ఉండేది. ఇప్పుడు రూ.ఆరేడు లక్షలు దాటిపోతోంది. బంగారం తులం ధర రూ.60 వేలు దాటిపోవడంతో ఖర్చు రెట్టింపయ్యింది. జిల్లాలో సుమారు 450 బంగారు దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ రూ.కోట్లలో అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో వధూ వరుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది.నింగిని తాకుతున్న నిత్యావసరాలు పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదలతో పెళ్లిళ్ల నిర్వాహకులు బెంబేలెత్తి పోతున్నారు. వంటనూనెల ధరలు, ఇతర సరుకుల ధరలు అధికమవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రూ.1800 ఉండే వాణిజ్య గ్యాస్‌ సిలండర్‌ ధర రూ.2,400 చేరిన విషయం విదితమే. టమాట, కూరగాయలు, కిరాణా సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయి. బంధువులు, స్నేహితులకు రవాణా సదుపాయాల కల్పించేందుకు రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, వాహనాల వార్షిక పన్నులు పెరగడంతో కార్లు, బస్సుల అద్దెలు 25 శాతం వరకూ పరిగాయి. దీంతో ప్రయాణ ఖర్చులకు సుమారు రూ.50 వేలు వరకు ఖర్చవుతోంది. పూల ఖర్చులూ అదే బాటలో ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ప్రస్తుతం మార్కెట్లో కిలో మల్లెలు రూ.500 వరకు పలుకుతున్నాయి. కనకాంబరాలు రూ.600 పైమాటే.. వేదిక పూల అలంకరణ నిమిత్తం రూ.లక్షకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కుటుంబసభ్యుల అవసరాల నిమిత్తం తక్కువలో తక్కువగా రూ.30 వేలు అయినా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. మొత్తం మీద తాజా పరిస్థితులలో పెళ్లి ఖర్చులు ధరల పెరుగుదల మధ్యతరగతివారికి, పేదలకు ఇబ్బందిగా మారింది. ఆడంబరాల సంగతి ఎలా ఉన్నా సాధారణ ఖర్చులే తడిసిపమోపడవుతున్నాయని వధూ, వరుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

➡️