సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

Feb 3,2025 21:59
సోలార్‌ విద్యుత్‌

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌
సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్స్‌ స్థాపన కోసం కృషి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎపి ట్రాన్స్‌కో క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్‌ విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి విధానంలో గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా క్షేత్ర స్థాయి విద్యుత్‌ సిబ్బంది చర్యలు తీసుకోవా లన్నారు. ఇందుకు ఎక్కువ విద్యుత్‌ వినియోగం చేసే వినియోగదారుల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. వాటికి అనుగుణంగా ఆయా వినియోగదారుల గృహాలను సందర్శించి అవగాహన కల్పించాలన్నారు. యూనిట్స్‌ స్థాపన నేపథ్యంలో మార్గదర్శకాలను సమగ్రంగా వివరించాలన్నారు. విద్యుత్‌ శాఖ క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి 2 వేల యూనిట్ల, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వెయ్య యూనిట్స్‌ ఏర్పాటు చేయాలని, ఆ మేరకు మండలాల వారీగా లక్ష్యాలను నిర్ణయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కె.తిలక్‌కుమార్‌, డిఆర్‌డిఎ పీడీ ఎస్‌వివిఎస్‌.మూర్తి, ఇఇలు ఎన్‌.సామ్యూల్‌, వై.డేవిడ్‌, వై.నారాయణ అప్పారావు, డి.శ్రీధర్‌వర్మ, ఎఇలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️