ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌డిసిల్టేషన్ పాయింట్స్ ఆధ్వర్యంలో కనీస స్థాయిలో తవ్వకాలు జరిపే విధానం ఉండాలని, ఇందులో ఎటువంటి మినహాయింపు లేకుండా పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, డిఎల్‌ఎస్‌ఎ ఛైర్మన్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరు క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. జిల్లా పరిధిలో 140 బోట్స్ మ్యాన్ సొసైటీలకి డిసిల్టేషన్ పాయింట్స్ వద్ద ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. బోట్స్ మ్యాన్ సొసైటీ సభ్యులు జీవన భతి కోసం చేసుకున్న విజ్ఞప్తిని అనుసరించి ఇసుక తవ్వకాలు జరపాల్సిందిగా అనుమతులు జారీ చేశామని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా బోట్స్‌మ్యాన్ సొసైటీలు కనీస స్థాయిలో తవ్వకాలు చేపట్టాలని, ఆ ప్రక్రియపై పర్యవేక్షణ తప్పనిసరి అని ఆదేశించారు. 48 గంటల్లో ఏయే బోట్స్ మ్యాన్ సొసైటీలు రోజుకి ఎంత చొప్పున ఇసుక తవ్వకాలు జరిపారో ఇరిగేషన్, మైన్స్ అధికారులు సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఎటువంటి తవ్వకాలు నిర్వహించకుండా నిరర్థకంగా బోగస్‌గా ఏర్పడిన బోట్లు మ్యాన్ సొసైటీల అనుమతులు నివేదిక ఆధారంగా రద్దు చేయాలన్నారు. ఆ మేరకు కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా ఉచిత ఇసుక సరఫరా విధానంపై గణాంకాలు తెలియయ జేయాలని, అధికారుల సమక్షంలో నమోదు చేసుకున్న ట్రాక్టర్ల ద్వారా సరఫరా విధానం ఉండాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో ఎంతమందికి ప్రయోజనం చేకూర్చగలిగామో తెలుసుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు. ఆర్‌డిఒలు ఆ మేరకు చర్యలు తీసుకోవడం, వచ్చే సమావేశంలో నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. ఓపెన్ రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ సమాంతరంగా చేపట్టాలని, డంపింగ్ చేయరాదని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. టెక్నికల్ కమిటీలో జిఎస్‌టి అధికారిని కూడా సభ్యునిగా నియమించాలని కలెక్టర్ సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సుమోటోగా కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో కొత్తగా వేమగిరి (కడియం), తీపర్రు (పెరవలి), పెండ్యాల (నిడదవోలు), పందలపర్రు (నిడదవోలు) ఓపెన్‌రీచ్‌లని గుర్తించామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఎస్‌పి ఎన్‌బిఎం.మురళీకృష్ణ, ఆర్‌డిఒలు ఆర్.కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి.ఫణి భూషణ్ రెడ్డి, ఇరిగేషన్ ఇఇ ఆర్.కాశీ విశ్వేశ్వర రావు, ఆర్‌టిఒ ఆర్.సురేష్, వై.శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారి బివి.గిరి పాల్గొన్నారు.