గతేడాది 697 ప్రమాదాలు,282 మంది మృతి
మృతుల్లో ఎక్కువ మంది యువతే
హెల్మెట్ లేకపోవడంతోనే మరణాలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిది
జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు మైనర్లు హద్దు మీరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎదుటి వారి ప్రాణాలకు హాని తలపెడుతున్నారు. అతివేగంగా వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతోంది. రవాణా, పోలీసు శాఖల అధికారులు అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా పరిస్థితిలో మార్పు ఉండటం లేదు. గతేడాది అమల్లోకి వచ్చిన చట్టాలు మరింత కఠినతరం చేసినా పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు. జిల్లాలో 7 లక్షలకు పైగా వాహనాలు జిల్లాలో మొత్తం 7,85,000 వాహనాలున్నాయి. వాటిలో ద్విచక్రవాహనాలు 5.52 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ వాహనాలను అత్యధిక మంది యువతే వినియోగిస్తున్నారు. అత్యధిక ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వలనే సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయినవారు, అంగవైకల్యం పొందిన వారిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధన అమలుకు నోచుకోకపోవటంతో చిన్నపాటి ప్రమాదాలలో సైతం మరణాలు నమోదు అవుతున్నాయి. నూటికి 90కిపైగా హెల్మెట్ లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించాయి. దీనికితోటు ట్రిబుల్ రైడింగ్ కూడా ప్రమాదాలకు కారణంగా ఉన్నాయి.
నిబంధనలు కఠినతరం
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారి భద్రతా చట్టాలు మరింత కఠినతరం అయ్యాయి. జరిమానాలు కూడా రెండింతలయ్యాయి. రెడ్ లైట్ ఉల్లంఘనకు జరిమానా: రూ.100 నుంచి ప్రస్తుతం రూ.500కు చేరింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్‌కు రూ.500 నుంచి ప్రస్తుత జరిమానా: రూ.5,000కు చేరింది. అతి వేగానికి జరిమానా: రూ.400 నుంచి రూ.1000కు చేరింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ.2000 నుంచి జరిమానా: రూ.10,000కు చేరింది. రేసింగ్, స్పీడింగ్‌కు రూ.500 నుంచి రూ.5000కు చేరింది.హెల్మెట్ ధరించకపోవడం జరిమానా: రూ.100 నుంచి రూ.1000కు చేరింది. మూడు నెలల పాటు లైసెన్సును రద్దు చేయనున్నారు. సీట్‌బెల్ట్ ధరించనికి వారికి రూ.100 నుంచి జరిమానా రూ.1000కి చేరింది. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్‌కు రూ.2,000 చొప్పున జరిమానా విధిస్తున్నారు.
హద్దు మీరుతున్న మైనర్లు ఇటీవల కాలంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలకు మైనర్లే కావడం ఆందోళనకు గురి చేస్తుంది. 18 ఏళ్లలోపు కలిగిన పిల్లలు ఈ వయసులో చదువు, ఆటలకే పరిమితం కావాల్సిన వీరు వయసుకు మించిన పనులు చేస్తున్నారు.. రోడ్లమీద బైకులతో హల్ చల్.చేస్తున్నారు. వేగంగా దూసుకు పోతూ ఆనందపడుతున్నారు. ఈసమయంలో బైకులు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణాల్లో వారి ఆనందం కాస్త ఆవిరవుతుంది. ఇలాంటి ప్రమాదాల్లో వీరే కాదు. ఎదుటి వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదం జరుగుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో ఇదే జరిగింది. మైనర్ బాలుడు తన తండ్రి టు వీలర్ తీసుకుని స్నేహితులతో కలిసి వేగంగా దూరుకుపోయాడు. వచ్చీరాని డ్రైవింగ్‌తో మరో వాహనాన్ని బలంగా ధీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఈ బాలుడితో పాటు ఎదుటి వాహనంపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మైనర్ల పట్ల పోలీసులు సీరియస్ గానే స్పందిస్తున్నారు.మైనర్లతో పాటు వారికి వాహనాలు ఇచ్చిన పెద్దలపైనా కేసులు సమోదు చేస్తున్నారు.
