అన్నదాతకు పన్నుపోటు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి ఉమ్మడి జిల్లాలో రబీ, ఖరీఫ్ సీజన్‌లలో సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు జరుగుతోంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 50 శాతానికిపైగా ఉపాధి పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ప్రధాన రంగంపై జిఎస్‌టి బాదుడు గోరుచుట్టుపై రోకలి పోటులా మారుతోంది. ఏటా రూ.90 కోట్ల మేరకు భారం పడుతోందని అంచనా. వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఏటికేడు పెరిగిపోతుండగా అందుకు అనుగుణంగా దిగుబడుల ధరలు లబించని దుస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలు ప్రతి సీజన్‌లోనూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆత్మస్థయిర్యం కోల్పోయి, కొందరు ఆత్మహత్యల బాట పడుతుండగా, మరికొందరు సాగుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు పన్నుల పేరుతో ఎడాపెడా బాదేస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందులపై విధిస్తున్న జిఎస్‌టి (వస్తు సేవల పన్ను) కర్షకులను కుంగదీస్తోంది. జిల్లాలో 80 శాతం చిన్న, సన్నకారు రైతాంగమే కావడంతో వారు ఈ అదనపు భారం మోయలేక అల్లాడిపోతున్నారు.2017 నుంచి అమలుకేంద్రప్రభుత్వం 2017 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి క్రిమిసంహారక మందులపై 18 శాతం యంత్ర పరికరాలపై 12 నుంచి 18 శాతం జిఎస్‌టి వసూలు చేస్తోంది. ఎరువులపై పన్నును 5 శాతానికి పరిమితం చేసి, విత్తనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మందులు, యంత్ర పరికరాలపై విధిస్తున్న పన్ను శాతం కంటే పెట్టుబడి ఖర్చులు పెరిగి పోతున్నాయని అన్నదాతలు అవేదన చెందుతున్నారు. ఇలా ప్రతిదానిపై జిఎస్‌టి అంటుండటంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. పురుగు ముందుల లావాదేవీలు రూ. 100 నుంచి. రూ.150 కోట్ల వరకూ జరుగుతుంటాయి. వ్యవసాయ ఉపకరణాలను ఏడాదికి రూ.110 కోట్ల వరకూ కొనుగోలు చేస్తుంటారు. వీటిపై కేంద్రం ఆధిక శాతం జిఎస్‌టి విధించడం వల్ల ఏడానికి జిల్లాలోని రైతులకు రూ.50 కోట్లు మేర భారం పడుతోంది.ఎరువులు, పురుగు మందులు తప్పనిసరి రెండు దశాబ్ధాల క్రితం రుతువులు కాలా నుగుణంగా నడిచేవి. దానికి తగ్గట్టుగానే పంటలకు చీడ పేదల బెడద తక్కువగా ఉండేది. కాలగమనంలో… రుతువులు కూడా గతి తప్పడం ప్రారంభమైంది. రకరకాల కొత్త తెగుళ్లు, చీడపీడలు పంటలకు ఆశించడం అధికమైంది. వీటి నివారణకు అనివార్యంగా రైతులు క్రిమి సంహారక మందులను పెద్దఎత్తున విచికారీ చేయడం మొదలుపెట్టారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరగడంతోపాటు, దిగుబడుల్లో నాణ్యత లోపిస్తోంది. ఈ సమయంలో గోరు చుట్టుపై రోకటి పోటు అన్న చందంగా జిఎస్‌టి వారిని మరింత బాధిస్తోంది. గతంలో పురుగు మందులపై పన్ను నామమాత్రంగా ఉండేది. రాష్ట్రప్రభుత్వ పరిధిలో ఉండటంతో పరిస్థితిని బట్టి పన్ను విధించేవారు. దీంతో ధరలు తక్కువగానే ఉండేవి. కేంద్రప్రభుత్వం పురుగు మందులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తీసుకెళ్లింది. పన్ను దశల వారీగా ప్రస్తుతం 18 శాతానికి చేరింది. ఫలితంగా ఏటా 10 శాతం ధరలు అదనంగా పెరుగతూ ఉన్నాయి. వ్యవసాయాన్ని మినహాయించాలని వేడుకోలుఏటా పెట్టుబడి ఖర్చులు పెరగడం, మరో వైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకో వైపు దిగుబడులు సరిగా రాకపోవడం వంటి కారణాలతో కర్షకులు నష్టాల పాలవుతున్నారు. దీంతో ఎక్కువశాతం మంది సాగుకు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవటంతో కష్టమైనా, నష్టమైనా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి జిఎస్‌టి పరిధి నుంచి వ్యవసాయాధారిత ఉపకరణాలను పరుగు మందులను మినహాయించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారీ జిఎస్‌టి కౌన్సిల్ పన్నులు విధించే వస్తువులపై సమీక్ష చేస్తున్నా రైతుల వినతిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా తమ కష్టాలను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ పరికరాలు, పురుగుమందులను జిఎస్‌టి నుంచి మినహాయిస్తే ఉపయుక్తంగా ఉంటుందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.