పాత తొలగింపులు సరే? కొత్త అక్రమ నిర్మాణాలు సంగతేంటి?

Feb 2,2025 16:17 #East Godavari

ప్రజాశక్తి-కడియం : డియం పంచాయతీ పరిధిలో ఒక పక్కన పాత ఆక్రమణలు తొలగిస్తుంటే, మరో పక్కన పంచాయతీ రోడ్లను ఆక్రమించి కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు యాధేచ్చగా నిర్మించేస్తున్నారు. గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకుల అనుయాయులు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు వీధులు ద్విచక్ర వాహనాలకు ఎక్కువ, ఫోర్ వీలర్ కు తక్కువగానూ దర్శనమిస్తున్నాయి. తాజాగా గ్రామంలోని కామిశెట్టి వారి వీధిలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాన్ని ధర్జాగా నిర్మించేస్తున్నాడు. ఇటీవలే కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి పడాల వారి వీధిలోకి వెళ్లే దారిలో పాత ఆక్రమణలను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తొలగించిన విషయం తెలిసిందే. కానీ దీనికి కూత వేటు దూరంలో నూతన ఆక్రమణ నిర్మాణం చేపడుతుంటే పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కళ్ళప్పగించి చూడడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. కడియంలో పాలకులు ఎప్పటి కప్పుడు అనుయాయులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం, వ్యతిరేకులకు అన్యాయం చేస్తున్నారని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుత పాలకులు మరో అడుగు ముందుకేసి వ్యతిరేకుల పట్ల మరీ అన్యాయంగా వ్యవహారిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుయాయుల తప్పులను భుజాన వేసుకుని మోచేస్తున్నారని, అలాగే ప్రభుత్వ జాగాలను ధారాధత్తం చేసేస్తున్నారని కొందరు గుస గుస లాడుకుంటున్నారు. మరి తాజా కామిశెట్టి వారి వీధి అక్రమ నిర్మాణం పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి!!!.

➡️