ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి అధికారపక్షం, ప్రతిపక్షంలో చేరకుండా సమస్యల పరిష్కారంలో ప్రజా పక్షాన నిలబడి గొంతెత్తి నినదించేది పిడిఎఫ్ ఎంఎల్‌సిలు మాత్రమేనని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వర అన్నారు. శనివారం రాజమండ్రి ఆనం రోటరీ హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి డివి.రాఘవులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంల్‌సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వంత పాడటంతో నిరుద్యోగులు, పేదలు, నిమ్న వర్గాలకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ, నిస్వార్థం క్రమశిక్షణ ప్రజా సమస్యల పట్ల పోరాటం పిడిఎఫ్ ఎంఎల్‌సిల ఆస్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు మాట్లాడారు. డిఎస్‌సి నియామకాల కోసం ఎన్నికల్లో మాట ఇచ్చి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి తొలి సంతకం చేసి కూడా ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటివరకు డిఎస్‌సి అతీగతీ లేదన్నారు. కుంటిచాకులు చెబుతూ డిఎస్‌సిని ప్రభుత్వం వాయిదా వేస్తోందన్నారు. విజన్ 2047 అంటూ ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా వ్యవహారాలు చేస్తోందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్, అంగన్‌వాడీల సమస్యల పట్ల కూడా ప్రభుత్వం సక్రంగా స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు, ఒపిఎస్ అమలు, నూతన పిఆర్‌సి కమిటీ ఏర్పాటు వంటి సమస్యల మీద కూడా ప్రభుత్వం ఇంకా ఉదాసీన వైఖరి అవలంబిస్తోందన్నారు. పిడిఎఫ్ అభ్యర్థి డివి రాఘవులుకు ఓటేసి గెలిపిస్తే, ప్రజా సమస్యల పట్ల శాసన మండలిలో నినదించే గొంతువుతారని పేర్కొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ శాసనమండలిలో గత పిడిఎఫ్ ఎంఎల్‌సి పనితీరు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తా పిడిఎఫ్ అభ్యర్థేనని విజయం సాధించే వరకు అందరూ ఐక్యతతో కృషి చేయాలని పేర్కొన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు మాట్లాడుతూ 2007 నుంచి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి మూడుసార్లు ఎన్నిక జరగగా రెండుసార్లు పిడిఎఫ్ అభ్యర్థులే విజయం సాధించారన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు పిడిఎఫ్ అభ్యర్థేనన్నారు. ఈ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ మనమే నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి డివి రాఘవులు మాట్లాడుతూ తాను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ యుటిఎఫ్, ఇతర ఉద్యోగ సంఘాల్లోని కీలక బాధ్యతలు నిర్వహించి అనేక పోరాటాల్లో, పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. తనను గెలిపిస్తే మండలంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నినదించే గొంతునవుతానని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యం మాట్లాడుతూ ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తున్నాయని, కాంట్రాక్టు ఉద్యోగుల రేషన్‌లైజేషన్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దాట వేస్తున్నాయని కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం జరగాలంటే, వాళ్ల వైపు పోరాటాలు చేస్తూ చట్టసభల్లో ప్రశ్నించాలంటే పిడిఎఫ్ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించు కోవాలన్నారు. పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించేందుకు గ్రాడ్యుయేట్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని మనం వాళ్ళని కలిసి అభ్యర్థించటమే తరువాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు జువ్వల రాంబాబు, జెఎసి జిల్లా నాయకులు ప్రవీణ్, అంగన్‌వాడీ రాష్ట్ర నాయకురాలు బేబిరాణి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయకర్, ఎ.షరీఫ్, ఉపాధ్యక్షులు ఎం.విజయ గౌరి, కోశాధికారి ఇవిఎస్‌ఆర్.ప్రసాద్, జిల్లా కార్యదర్శి కె.రమేష్, ఎం.శ్రీనివాస్, ఇ.శ్రీమణి, చిలుకూరి శ్రీనివాసరావు ప్రకాష్, పి.శ్రీనివాసమూర్తి, ఎం.దయానిధి, వివి.రమణ, వెంకటరమణ, నర్సారెడ్డి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపస్ రావు తదితరులు పాల్గొన్నారు.
