ఉపాధ్యాయుల కొరతతో అవస్థలు

Dec 13,2024 22:25
ఉపాధ్యాయుల కొరత

సరిపడా గదులు లేక ఇబ్బందులు
హిందీ టీచర్‌ లేక ప్రారంభం కాని సిలబస్‌
ప్రజాశక్తి – గోపాలపురం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పే పాలకుల మాటలు నీటి మూటలు గానే మిగిలిపోతున్నాయి. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని చిట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలే దీనికి నిదర్శనం.చిట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యాబోధన జరుగుతుంది. ఈ పాఠశాలలో 318 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు 57 మంది వరకూ ఉన్నారు. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు టైమ్‌ టేబుల్‌ కూడా విడుదలైంది. మార్చి నెలలో వారు పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఇక్కడ నేటికీ హిందీ టీచర్‌ లేరు. దీంతో సిలబస్‌ పూర్తికాలేదు. పదో తరగతి విద్యార్థులకూ సిలబస్‌ పూర్తికాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఈ పాఠశాలకు రెండు హిందీ టీచర్‌ పోస్టులు మంజూరయ్యాయి. ఉపాధ్యాయుల కొరతతో ఒక హిందీ టీచర్‌నే నియమించారు. గతేడాది ఆగస్టు నెలలో ఆయన కూడా బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ హిందీ టీచర్‌ను నియమించలేదు. ఈ ప్రభావం పదోతరగతి విద్యార్థులపై ఎక్కువగా ఉంది. గతేడాది హిందీ మాస్టారు లేకపోవడంతో విద్యార్థులు అత్తెసరమార్కులతోనే గట్టెక్కారు. అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు వచ్చినప్పటికీ హిందీ సబ్జెక్టులో మాత్రం పాస్‌ మార్కులు మాత్రమే రావడంతో మార్కులు తగ్గిపోయాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మండలంలోని ఇతర పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల కొరత ఉంది. నాగులు ఉన్నత పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు లేరు. ఎలిమెంటరీ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తరగతి గదుల కొరతచిట్యాల హైస్కూల్లో 318 మంది విద్యార్థులు ఉన్నారు. నాలుగు గదులు గల భవనాలు సుమారు 36 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. స్లాబు పెచ్చులూడి పడటంతో నాలుగు తరగతి గదులను వినియోగించట్లేదు. దీంతో విద్యార్థులను సైన్స్‌ ల్యాబ్‌, స్టాల్‌ ల్యాబ్‌, లైబ్రరీ, బిసిఆర్‌ రూమ్‌లలో కూర్చోబెట్టి తరగతులను నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫేస్‌2 నాడునేడులో ఆరు అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. ప్రస్తుతం అవి నిలిపేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
టీచర్‌ లేకుండా ఎలా చదవాలి
ప్రస్తుతం పాఠశాలలో హిందీ టీచర్‌ లేరు. ఒక్క పాఠం కూడా చెప్పలేదు. ఎలా చదవాలో.. ఏం చదవాలో తెలియడం లేదు. ఇలా అయితే పబ్లిక్‌ పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదు. చేసేది లేక గైడ్లు కొనుక్కుని బట్టీ పట్టాల్సి వస్తుంది. V- జగత సూర్యప్రకాష్‌, 10వ తరగతి విద్యార్థి
ఇప్పటి వరకు హిందీ సిలబస్‌ ప్రారంభించలేదు
ఇప్పటి వరకూ పాఠశాలలో నిర్వహించిన హిందీ పరీక్షలో ఏం రాసామో కూడా తెలియదు. పబ్లిక్‌ పరీక్షల్లో హిందీ సబ్జెక్టులో ఫెయిల్‌ అవుతానేమో అని భయం వేస్తుంది. ఇప్పటికైనా హిందీ టీచర్‌ను నియమించాలి.
– పిల్లి దీపిక, 10వ తరగతి విద్యార్థిని
హిందీలో విద్యార్థులు వెనుకబడుతున్నారు
హిందీ టీచర్‌ లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఈ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఏదో విధంగా ఇతర ఉపాధ్యాయులతో హిందీ సిలబస్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ సబ్జెక్టుపై ఇతర ఉపాధ్యాయులకు పట్టు తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి అనేక మార్లు ఈ విషయాన్ని తీసుకెళ్లాను. పాఠశాలలో ఆరు అదనపు తరగతి గదులు అవసరం ఉంది.
– కె.శ్రీనివాసరావు, హెచ్‌ఎం
ఉన్నతాధికారులకు నివేదించాం
మండంలో పలు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదించాం. చిట్యాల హైస్కూల్లో హిందీ టీచర్‌ లేరనే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాము. విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాను.
– ఎ.ఉమామహేశ్వరరావు, ఎంఇఒ-2

➡️