సమస్యలపై బీమా ఉద్యోగుల నిరసన

Jan 23,2025 00:15
సమస్యలపై బీమా ఉద్యోగుల నిరసన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఆలిండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పిలుపు మేరకు బుధవారం రాజమండ్రి ఎల్‌ఐసి డివిజనల్‌ ఆఫీసు ముందు లంచ్‌ విరామ సమయంలో నిరసన తెలిపినట్టు యూనియన్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.కోదండరామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసిలో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న క్లాస్‌ 3, క్లాస్‌ 4 ఉద్యోగాల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. 2020లో ఎల్‌ఐసి ఇచ్చిన నియామక ప్రకటనలో భర్తీ కాని 2700 అసిస్టెంట్ల నియామకం వెంటనే చేపట్టి, ప్రస్తుత ఉద్యోగులపై పడుతున్న అధిక పని భారం తగ్గించాలని కోరారు. ఆలిండియా స్థాయిలో జీవిత బీమా సంస్థలో క్లాస్‌ 3, 4 ఉద్యోగులలో, 85 శాతం పైన సభ్యత్వం ఉన్న ఆలిండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌కు వెంటనే గుర్తింపు ఇవ్వాని కోరారు. దేశవ్యాప్తంగా, రాజమండ్రి డివిజన్‌ పరిధిలో ఉన్న 20 శాఖా కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఈ నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి డివిజన్‌ అధ్యక్షులు ఎస్‌ఆర్‌జె.మాథ్యూస్‌ మాట్లాడుతూ తాత్కాలిక ఉద్యోగులుగా ఎంతో మంది సంస్థలో క్లాస్‌ 4 ఉద్యోగులుగా పని చేస్తున్నారని, వెంటనే నియామకాలు చేపట్టడం ద్వారా వారిని కూడా శాశ్వత ఉద్యోగులుగా నియమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్‌ఎన్‌.రాజు, డివిజన్‌ ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, మహిళా ఉద్యోగుల కన్వీనర్‌ ఆర్‌.శిరీష, శ్రీలత, రామలక్ష్మి, రమణ, జిఎన్‌ఎల్‌.లక్ష్మి, బి.శ్రీనివాసరావు, పి.సాయిబాబా, ఎం.రమేష్‌ బాబు, భరణి, జిలానీ, పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు.

➡️