సా..గుతున్న రబీ

Feb 5,2025 22:30
సా..గుతున్న రబీ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి జిల్లాలో రబీ పంటల సాగు పనులు దాదాపు పూర్తి కావాల్సి ఉండగా ఇంకా ఇప్పటికీ 81 శాతానికే పరిమితమైంది. ఈ ఏడాది రబీలో అని రకాల పంటలూ కలిపి 1.99 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఏటా రబీ సాగుకు నీటి ఎద్దడి తలెత్తుతున్న నేపధ్యంలో ముందస్తు సాగు చేయాలని అధికార యంత్రాంగం భావించింది. డిసెంబరులో తుఫాను నేపథ్యంలో ప్రణాళికలు పూర్తిగా తలకిందులయ్యాయి. దీంతో రాబోయే రబీలోనూ కష్టాలు తప్పవనే సంకేతాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతన్నలు అనేక సందేహాల నడుమ సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాతి పండుగ దాటినా జిల్లాలో రబీ సాగు 87 శాతానికి కూడా చేరుకోలేదని స్పష్టమవుతోంది. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకూ 1,30,000 ఎకరాల్లో వరి నాట్లు పూర్లయ్యాయి. జొన్న పంట 825 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా కేవలం 370 ఎకరాల్లో ప్రారంభమైంది.మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 24,452 ఎకరాలు కాగా కేవం 15,077 ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది. ఇక అపరాల విషయానికి వస్తే సెనగలు 2,325 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,022 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. పెసలు 1,447 ఎకరాల్లో ప్రారంభించాల్సి ఉండగా 145 ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైంది. అంటే కేవలం 10 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. మినుములు 2,335 ఎకరాలకు గాను ఇప్పటివరకు 705 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. నూనె పంటలైన వేరుసెనగ 632 ఎకరాలకు గాను 337 ఎకరాల్లోనే సాగు మొదలయ్యింది. నువ్వులు 725 ఎకరాలకు గాను 1,55 ఎకరాల్లో సాగు ప్రారంభమయ్యింది. పొద్దు తిరుగుడు పంట 545 ఎకరాలకుగాను కేవలం 70 ఎకరాల్లో సాగు ప్రారంభమయ్యింది. వాణిజ్య పంటల సాగులో ప్రధానంగా చెరకు 1,837 ఎకరాలకు గాను కేవలం 140 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. కేవలం 8 శాతమే నమోదయ్యింది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఏటా చెరుకు సాగు క్రమంగా తగ్గిపోతోంది. పొగాకు 14,490 ఎకరాలకు గాను 12,395 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటికే జిల్లాలో వరి నాట్లు కూడా పూర్తి స్థాయిలో పడలేదు. సకాలంలో కాల్వలకు నీరు విడుదల చేసినా అవి శివారు భూములకు చేరే సరికి ఆలస్యం కావడంతో సాగులో జాప్యం జరుగుతోందని తెలు స్తోంది. రైతులు ముందస్తుగానే డిసెంబరు 31 నాటికి వరి నారు వేసి నాట్లు ప్రారంభిస్తే సాగునీటి కొరత అధిగమించవచ్చని తొలుత అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం నెల రోజులు ఆలస్యం కావడంతో సీలేరు జలాలపై ఆధారపడాల్సిన తప్పని పరిస్థితి. సీలేరులో అదనంగా నీరు లభించని పక్షంలో తుది దశలో సాగునీటి కొరత ఏర్పడుతుందని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

➡️