ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
స్థానిన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం, ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్స్ అండ్ అలైడ్ సైంటిస్ట్స్ సహకారంతో ‘రేడియోకెమిస్ట్రీ మరియు రేడియో ఐసోటోప్‌ల అనువర్తనాలు’ అనే అంశంపై ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌ను ముంబైలోని బార్క్ రేడియోకెమిస్ట్రీ విభాగం, రేడియోకెమిస్ట్రీ అండ్ ఐసోటోప్ గ్రూప్ మాజీ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పికె.మోహపాత్ర ప్రారంభించారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎట్ గ్లాన్స్ : శాంతియుత అణుశక్తి ఉపయోగాలు’ అనే అంశంపై మోహన్‌పాత్ర మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధన ఉత్పత్తి మరియు పర్యావరణ స్థిరత్వంలో అణు శాస్త్రం పాత్రను ఆయన వివరించారు. ఆధునిక సమాజంలో దాని కీలకమైన అనువర్తనాలను వివరించారు . ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ కెమిస్ట్స్ అండ్ అలైడ్ సైంటిస్ట్స్ కన్వీనర్ డాక్టర్ పిఎస్. రామాంజనేయులు అణు శాస్త్రం యొక్క సామాజిక ప్రయోజనాలను చర్చించారు, అణు శాస్త్రానికి సంబంధించిన శాస్త్రీయ స్వభావాన్ని పెంపొందించడం, రోజువారీ జీవితంలో అణు వికిరణం యొక్క సానుకూల అంశాల గురించి అవగాహన కల్పించారు. సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ సబ్యసాచిపాత్ర, రేడియోధార్మిక క్షయం, పదార్థంతో రేడియేషన్ పరస్పర చర్యపై మాట్లాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, భౌతిక శాస్త్ర విభాగం అధిపతి కోమల లక్ష్మి, వర్క్‌షాప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి.గౌరినాయుడు పాల్గొన్నారు. తొలుత ప్రిన్సిపల్ రామచంద్ర మాట్లాడారు. ఫిబ్రవరి 3 నుంచి 7వరకూ ఈ వర్క్‌షాపు జరుగుతుందన్నారు. రేడియోధార్మిక క్షయం, అణు నిర్మాణం, స్థిరత్వం, గుర్తింపు పద్ధతులు, అణుశక్తి శాఖలో కెరీర్ అవకాశాలు వంటి కీలక అంశాలపై వక్తలు మాట్లాడతారన్నారు. విద్యుత్ ఉత్పత్తి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆహార భద్రత, పరిశ్రమ వంటి రంగాల్లో అణుశక్తి యొక్క శాంతియుత అనువర్తనాలపై కూడా చర్చలు ఉంటాయన్నారు. రేడియోకెమిస్ట్రీ, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమ, పర్యావరణ శాస్త్రాల్లో రేడియో ఐసోటోప్‌ల విభిన్న అనువర్తనాలపై సమగ్ర అవగాహన కల్పించడమే దీని లక్ష్యమన్నారు. అణు శాస్త్రంపై ఉన్న అపోహలను తొలగించడం వర్కుషాపు ప్రధాన లక్ష్యమన్నారు. రోజువారీ సెషన్లలో ఉదయం మూడు నుంచి నాలుగు ఉపన్యాసాలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం ప్రయోగాత్మక సెషన్‌లు ఉంటాయన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
