ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ రెవెన్యూ అంశాలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ అధికారులు నిత్యకృత్యమైన సమావేశాల్లా కాక ఫలవంతం అయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలని సూచించారు. సమస్య పరిష్కారం కోసం ఎస్‌ఒపి (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం) మార్గదర్శకాలను జారీ చేస్తామని, వాటిపైనే ఆధారపడకుండా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భూముల విషయంలో సర్వే నంబర్, ఎల్‌పిఎం నెంబర్ ప్రకారం సబ్ డివిజన్ చేయాల్సి ఉందన్నారు. పిజిఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారం దిశగా నాణ్యత మెరుగుపరచడానికి సరైన వ్యూహం రూపొందించాలన్నారు. ప్రభుత్వ, ప్రవేటు భూముల పరాయీకరణ (ఎలినేషన్) కోసం అర్జీలు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. తాళ్లపూడి మండలంలో వైట్ ఫీల్డ్ స్థలాలు ఇతరులకి కేటాయింపు చెయ్యాలని, అనపర్తి నియోజకవర్గంలో వ్యర్థాల నుంచి సంపద సృష్టి కోసం కేటాయించిన భూములను రద్దు చేయాలని పిజిఆర్‌ఎస్‌లో విభిన్న అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం కేటాయించిన భూములు వినియోగించని సందర్భంలో పరాయీకరణ కోసం అర్జీలు, దరఖాస్తులు వస్తున్నట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వర పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, సిసిఎల్‌ఎ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమస్య పరిష్కారం దిశలో అధికారుల స్థాయిలో కాకుండా క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర సమాచారం తెలుసుకుని పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ టి.సీతారామ్మూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి, ఆర్‌డిఒలు కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా ల్యాండ్ అండ్ సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
