ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రభుత్వ పాఠశాలలో, పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు 4 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ పాఠశాలల శానిటేషన్ (ఆయా) కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం డిఇఒకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి.పవన్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న పేదవర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలో అనేక దశాబ్దాలుగా శానిటేషన్ కార్మికులుగా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. వీరికి దాదాపుగా 4 నెలల నుండి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాలయని తెలిపారు. సెప్టెంబర్ 2న ప్రభుత్వం జిఒ నెం.413 ఇచ్చి ఏప్రిల్, మే నెలలకు సగం వేతనాలు రూ.3 వేలు, జూన్ నెలకు పూర్తివేతనం రూ.6 వేలు చెల్లించినట్టు తెలిపారు. నేటికీ జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండటం వల్ల ఆయాలపైన విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని కోరారు. శానిటేషన్ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలను, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ (ఆయా) వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, చాలీ చాలని వేతనాలతో, నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో ఉండటం వల్ల కుటుంబాలను పోషించలేక చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, వేతనాలు పెంచాలని, ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, శానిటేషన్ పరికరాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయాలు సరోజిని, దేవి, స్వాతి, హేమలత, మరిడమ్మ, రత్నం, దుర్గ, ఇంద్రజిత్ తదితరులు పాల్గున్నారు.