థీమ్‌ పార్క్‌లుగా అభివృద్ధి చేయాలి

Feb 8,2025 00:00

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాక ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో కూడి నగరవాసులను, పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆ మేరకు పనులు పూర్తి చెయ్యాలని తెలిపారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సెవెన్‌ హిల్స్‌ అసోసియేట్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని 26 పార్క్‌లు , నగరవనం అభివృద్ధిపై ప్రతిపాదించిన ముసాయిదా పిపిటిని మున్సిపల్‌ కమిషనర్‌ కేతన గార్గ్‌తో కలిసి కలెక్టర్‌ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ, నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే నగరంలో కంబాల చెరువు పార్కు, దానవాయిపేట, ప్రకాశ్‌ నగర్‌, జెఎన్‌ రోడ్డు, ఎవి.అప్పారావు రోడ్డు, వంటి ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేశామని, వాటికి మరింత విలువ ఆధారితమైన విధానంలో పార్కుల అభివృద్ధి చెయ్యాల్సి ఉందన్నారు. కేవలం పార్కులు విశ్రాంతికో, పిల్లల ఆటలకో పరిమితం కాకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా థీమ్‌ పార్కులు ఆటలకు, జిమ్‌, యోగా, డ్యాన్స్‌, మెడికేటెడ్‌ ప్లాంట్స్‌, మ్యూజిక్‌, డ్యాన్స్‌, రాక్‌ గార్డెన్‌, శారీరక వ్యాయామం, స్పోర్ట్స్‌, వాటర్‌ షో, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, ఫ్లవర్‌, బర్డ్‌, వ్యర్థాల నుంచి విభిన్న ఆకృతుల కలయిక, ఇక్కడి సంస్కతి సంప్రదాయాల ఆధారంగా వినూత్న డిజైన్లు రూపొందించడం ద్వారా వివిధ రకాల ప్రతిపాదనలతో పార్కుల ఏర్పాటు చేయలన్నారు. పిల్లలకు ఆహ్లాదం కలిగించేలా పార్కులు ఉండేలా చూడాలని కలెక్టర్‌ ప్రశాంతి సూచించారు. పెద్ద వారి నుంచి చిన్నారుల వరకు అన్ని వర్గాల వారికీ ఆసక్తి, పార్కులకి రావాలనే ప్రేరణ కలుగ చేయాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి వాటి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యాటక, హార్టికల్చర్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులతో కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కడియం ప్రాంతాన్ని పర్యటక పరంగా ఆకట్టుకునే రీతిలో అభివృద్ధి ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించి, కార్యరూపం దాల్చినట్టు తెలిపారు. కడియం నర్సరీలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ రకాల అంశలతో కూడిన బోటింగ్‌, స్టాల్ల్స్‌, జిప్‌ లాగ్‌, అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ తదితర అంశాల సమ్మేళనంగా రూపొందించిన రూట్‌ మ్యాపింగ్‌పై సూచనలు చేశారు. ఉపాధి స్టాల్ల్స్‌, బోటింగ్‌ ప్రతిపాదన కోసం లే అవుట్‌పై అధికారులు వివరించారు. వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ పాత్‌లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరవనం అభివృద్ధిపై వినూత్న ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ కేతన గార్గ్‌ పేర్కొన్నారు. ఇకో ఫ్రెండ్లీగా అభివృద్ధి చెయ్యడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రణాళిక తయారు చేసిన పిపిటిని పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ శైలజ వల్లి, ఆర్‌ఎంసి అధికారి అబుల్‌ మాలిక్‌, ఎపిఎంఐపి పీడ ఎ.దుర్గేష్‌, జిల్లా పర్యటక అధికారి పి.వెంకటాచలం, ఎంపిడిఒ కె.రమేష్‌, కడియం డిప్యూటీ తహశీల్దారు సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️