పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ప్రారంభం

May 12,2024 22:49

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు రూరల్‌, నిడదవోలుజిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ కోసం పూర్థిస్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్‌ఆర్‌ జెడ్‌పి బార్సు హైస్కూల్లో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, అనపర్తి నియోజకవర్గ పరిధిలో 228 పోలింగ్‌ కేంద్రాల్లో సుమారు రెండు వేల మంది పోలింగ్‌ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్స్‌, సర్వైవల్‌ బృందాలు, పోలీసు సిబ్బంది విధుల్లో భాగస్వామ్యం అయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 228 పోలింగ్‌ కేంద్రాలను 101 లొకేషన్స్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21 మంది సెక్టార్‌ అధికారులు, 21 రూట్‌ల ద్వారా పోలింగ్‌ సామాగ్రిని తరలించామన్నారు. 228 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పిఒలు 186 మంది, ఎపిఒలు 189 మంది, ఇతర పోలింగ్‌ సిబ్బంది 707 మందిని నియమించనున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను 63 మంది మైక్రో అబ్జర్వర్స్‌ నిశితంగా పరిశీలిస్తారన్నారు. వారు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి, ఎన్నికల సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉంటారని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి ఎమ్‌.మాధురి మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో ఉన్న 228 పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ మెటీరియల్‌ తరలించే ప్రక్రియ ప్రారంభం చేశామన్నారు. ఇవిఎంలు, కంట్రోల్‌ యూనిట్స్‌, బ్యాలెట్‌ యూనిట్స్‌ తరలింపునకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మావులేటి సోమరాజు హైస్కూల్లో ఆదివారం పోలింగ్‌ సామాగ్రి పంపిణీని సబ్‌ కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి అశుతోష్‌ శ్రీవాత్సవ్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌కు సంబంధించి ఇవిఎం యంత్రాలు, వివి.పాట్స్‌, పోలింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ తదితర సామాగ్రి అందిస్తున్నామన్నామని తెలిపారు. ఆ మేరకు సామాగ్రికి చెందిన చెక్‌ లిస్ట్‌ కూడా ఇస్తున్నామన్నారు. చెక్‌ లిస్ట్‌లో తెలిపినవన్నీ వాటిలో ఉన్నాయో, లేదో అని పోలింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా సరి చూసుకోవాలన్నారు. సామాగ్రి తీసుకున్న అనంతరం పోలింగ్‌ సిబ్బంది పిఒ, ఎపిఒ ఇతర పోలింగ్‌ సిబ్బంది తమకు కేటాయించిన బస్సుల్లో పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లాలన్నారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం వద్ద పోలింగ్‌ సిబ్బందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్‌లో రాత్రికి బస చేసి, 13వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఉదయం 7 గంటలకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ పక్రియ ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 101 లోకేషన్లలో 176 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో 1,84,136 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 89,743 మంది, మహిళలు 94,388 మంది, ట్రాన్స్‌ జెండర్స్‌ ఐదుగురు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్‌ రోజున ఎటువంటి సమస్యలూ ఉత్పన్నం కాకుండా మైక్రో అబ్జర్వర్లు, పోలీసు భద్రతా సిబ్బందిని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో నియమించినట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిర్భయంగా వేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసామని నిడదవోలు ఆర్‌ఒ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌.వెంకట రమణ నాయక్‌ తెలిపారు. ఆదివారం స్థానిక ఉమెన్స్‌ కాలేజీ ఆవరణలో పోలింగ్‌ సామగ్రి పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గంలో 205 పోలింగ్‌ స్టేషన్లలో 41 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. నియోజక వర్గ పరిధిలో 2,13,396 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 1,04,235 మంది పురుషులు, 1,09,157 మహిళా ఓటర్లు, నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారన్నారు.

➡️