అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్
ప్రజాశక్తి – రాజమహేంద్రవరంరూరల్
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామని, అగిప్ర్రమాద రహిత దేశానికి అందరూ సహకరించాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జెనరల్ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. సోమవారం ఇన్నిస్‌పేట అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు నివారణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా మన్నారు. అగ్నిప్రమాద రహిత సురక్షిత భారతదేశమే లక్ష్యమన్నారు. దీనికి అందరూ సహకరించాలన్నారు. వంట ఇంట్లో గాలి వెలుతురు ఉండేలా చేసుకోవాల న్నారు. అగ్ని ప్రమాదాన్ని గమనించిన వెంటనే ఆరుబయట సురక్షిత ప్రాంతానికి వెళ్లాలన్నారు. విద్యుత్ వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 అగ్రిమాపక వాహనాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లిలో ఫైర్ స్టేషన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అగ్ని ప్రమాదాల వల్ల ఇప్పటివరకు రూ.9.28 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, రూ.38.28 కోట్ల ఆస్తినికి అగ్నిమాపక సిబ్బంది కాపాడారన్నారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న ఏడుగురిని కాపాడారన్నారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.153 కోట్లతో 25 ఫైర్ స్టేషన్లను నిర్మించనున్నామన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో నీరు, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్ స్టలేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన అగ్ని మాపక అధికారి ఎం.మార్టిన్‌లూథర్‌కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
