పంచాయతీల్లో టిబి టెస్టులు చేయాలి

Nov 2,2024 23:26
పంచాయతీల్లో టిబి టెస్టులు చేయాలి

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాకు చెందిన 109 పంచాయతీలకు టిబి ముఖ్త్‌ కింద గాంధీ మెడల్‌, సర్టిఫికెట్లు అందించడం ద్వారా వారిపై మరింత బాధ్యత పెరిగిందని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఆనం కళా కేంద్రంలో టిబి ఫోరం, సొసైటీ, టిబి ముక్త్‌ గ్రామ పంచాయతీ అవార్డు ప్రధాన సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ టిబి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సరైన చికిత్సలు అందించాలని తెలిపారు. పంచాయతీలలో టిబి ప్రిసంటివ్‌ టెస్టులను జనాభా ప్రాతిపదికన చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందని తెలిపారు. అందులో భాగంగా ప్రతి లక్షకు మూడు వేల టెస్టులు తప్పక చేయించాలన్నారు. టిబి విముక్త్‌ కార్యక్రమాన్ని సమగ్రమైన విధానంలో చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల పరిపాలనాపరమైన విధుల నిర్వహణలో సమాజ ఆరోగ్య సంరక్షణ అత్యంత ప్రాధాన్యత కూడుకున్నదని తెలిపారు. అందులో భాగంగానే నేడు పంచాయతీ కార్యదర్శుల బాధ్యత, విధి నిర్వహణలో వారి పాత్రపై ఇటువంటి వేదిక ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో గోల్డెన్‌ గాంధీ అవార్డు కోసం తమ వంతుగా కార్యదర్శులు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. స్క్రీనింగ్‌, పరీక్షలు, నిర్ధారణ, చికిత్స ద్వారా 2025 నాటికి టిబి విముక్తి భారత్‌ దిశలో ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్లాలని సూచించారు. టిబి వల్ల మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకీ ఇద్దరు మరణిస్తున్నారని తెలిపారు. టిబి లక్షణాలు ఉన్న వారికి మెరుగైన పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్‌ ఎన్‌.వసుంధర, డిపిఒ ఎం.నాగలత, డిఇఎఒ ఎంఆర్‌పి ఎస్‌.సత్యకుమార్‌, డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️