నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం

Mar 17,2025 00:22
నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిపదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి తొలి మెట్టు. ఈ తరుణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అదికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. విద్యార్థులను 8.45కు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకూ నిర్వహించనున్నారు. పరీక్షా నిర్ధేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి హాజరయ్యేలా తల్లిదండ్రులు, విద్యార్థులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అదే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమల్లో ఉంటుందని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గుంపులుగా ఉండేందుకు అవకాశం లేదు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లలో స్కూల్‌ అసిస్టెంట్ల నియామకానికి ప్రాధాన్యమిచ్చారు. సరిపోని పక్షంలో ఎస్‌జిటిలతోపాటు ఇతరుల నియామకాన్ని చేపట్టారు. సబ్జెక్టు టీచర్లను మాత్రం వారి పరీక్ష రోజు రిలీవ్‌ చేస్తారు. ఈసారి పరీక్షల్లో స్కూల్‌ అసిస్టెంట్ల నియామకానికి ప్రాధాన్యమిచ్చారు. స్కూల్‌ అసిస్టెంట్లు సరిపోని పక్షంలో ఎస్‌జిటిలతో పాటు ఇతరుల నియామకాన్ని చేపట్టారు. సబ్జెక్టు టీచర్లను వారి పరీక్ష నిర్వహణ రోజు రిలీవ్‌ చేస్తారు. పరీక్షలకు సంబంధించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేలకు పైగా ఇన్విజిలేటర్లను నియమించారు.మెడికల్‌ కిట్లు సిద్ధంపరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలందేలా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితోపాటు మందులను వైద్యశాల ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రంలో ఎఎన్‌ఎంతోపాటు ఆశా వర్కర్‌ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన. మందులు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌ఫోన్‌ జోన్‌లుగా ప్రకటించారు. సమస్యాత్మక కేేంద్రాల వద్ద ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు చేశారు. మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. స్క్వాడ్స్‌ ప్రతిరోజూ ఆయా కేంద్రాలను తనిఖీ చేస్తాయి. పరీక్షల విధుల్లో ఉన్నవారు మినహా బయటి వ్యక్తులను కేంద్రాల్లోకి అనుమతించరు. వికలాంగులకు అవసరమైతే స్క్రయిబ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులకు సూచనలుపరీక్షలు రాసే విద్యార్థులంతా ఉదయం 8.30 గంటలకల్లా ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.45 నుంచి 8:30 వరకు మాత్రమే విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతి స్తారు. తరువాత గేట్లు మూసి వేస్తారు. రోల్‌ నెంబర్‌ ఆధారంగా విద్యార్థి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్న తర్వాత ఇన్విజిలేటర్‌ బార్‌ కోడింగ్‌, ఒఎంఆర్‌ షీట్‌, ప్రశ్నపత్రం, ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇస్తారు. తర్వాత ఒఎంఆర్‌ షీట్‌ పూరించే విధానంపై ఇన్విజిలేటర్‌ ఇచ్చే సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలి. దానిపై అనవసరమైన గీతలు, రాతలు రాయకూడదు. ఇన్విజిలేటర్‌ ఇచ్చిన ఒఎంఆర్‌ షీట్‌పై విద్యార్థి పేరు, పరీక్షకు సంబంధించిన వివరాలు సక్రమంగా ఉన్నవీ, లేనివీ నిర్ధారించుకోవాలి. 10:30 గంటలకు పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగిసే వరకూ విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు. తూర్పు గోదావరి జిల్లాలో 25, 723 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాలు 134, ఉన్నాయని అధికారులు తెలిపారు.

➡️