ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. అత్యధిక బంకులలో టైర్లకు గాలి కొట్టిద్దామంటే అవకాశం ఉండదు.. దాహం వేస్తే తాగునీరు దొరకదు.. మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా నిర్వహన అధ్వానంగా మారింది. పెట్రోల్, డీజిల్ కొలతల్లోనూ నీలి నీడలు కమ్ముతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోలు నాణ్యతా ప్రమాణాలు పరీక్షించడానికి ఫిల్టర్ పేపర్లు వినియోగదారులకు ఇవ్వాలి. ఎక్కడా ఇస్తున్న దాఖలాలు లేవు. ప్రజల ప్రయాణ అవసరాల రీత్యా జిల్లాలో వాహనాల సంఖ్య ప్రతి సంవత్సరమూ గణనీయంగా పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు, లారీలు, బస్సులు ఇతర వాహనాల సంఖ్య కూడా అధికంగా వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ వ్యాపారం విస్తతంగా పెరగటంతో జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు సుమారు 100కు పైగా ఏర్పాటైనట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పెట్రోలు, డీజిల్ సరఫరా చేసే కంపెనీలు సైతం డీలర్లకు ఆకర్షణీయమైన కమీషన్ ఇస్తూ బంకుల సంఖ్యను పెంచుతూ వస్తున్నాయి. అయితే నాణ్యత, సౌకర్యాలు తనిఖీ చేయాల్సిన సంబంధిత శాఖలైన పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, రెవెన్యూ, విజిలెన్స్ తదితర విభాగాల అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో మోసాలు ఇలా…మైక్రోచిప్ మాయాజాలంతో పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు, సిబ్బంది అక్రమాలకు తెరతీస్తున్నారు. పెట్రోల్ వేసేందుకు పైపు నాజిల్ తీసి బైక్ ట్యాంక్‌లో పెట్టగానే.. కొన్నిచోట్ల తొలుత సున్నాతో ప్రారంభమవుతోంది. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే రూ.వందల విలువగల ఆయిల్ వెళ్లినట్లు రీడింగ్ చూపిస్తోంది. మరి కొన్ని చోట్ల మీటర్ రీడింగ్ 10 లేదా 20 పాయింట్ల వద్ద ప్రారంభమవుతోంది. అత్యధిక బంకులో రూ.100కి రూ.90 మాత్రమే పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు అన్నిటికీ ముందుగానే మదర్ బోర్డులలో రీడింగ్ తప్పుగా మైక్రోచిప్‌లో తప్పుడు సంకేతాలు ఇచ్చేలా రూపొందించడం కారణమని తెలుస్తోంది. డిజిటల్ కాటా లోపలి భాగంలో ఇంటిగ్రేటెడ్ చిప్ అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా రీడింగ్ ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కొలతల తేడా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధమైన పద్ధతి పట్టణాలతోపాటు జాతీయ రహదారిపై ఉన్న అనేక బంకుల వద్ద కనిపిస్తోంది.అనుసరించాల్సిన నిబంధనలుపెట్రోలు బంకుల్లో 10 వేల లీటర్ల ఇంధనం విక్రయిస్తే వచ్చిన ఆదాయంలో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.600 వెచ్చించాలి. నెలకు రూ.18 వేలు మరుగుదొడ్లకు, మంచినీరు, ఇతర సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయాలి. వినియోగదారుల టైర్లలో గాలి తగ్గి బంకు వద్దకు వస్తే గాలి నింపే యంత్రాలు పని చేయడం లేదని అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా వాహనాలకు గాలి నింపే యంత్రాలు ఏర్పాటు చేయాలి. నిత్యం పని చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన చోదకులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు ఉండాలి. కానీ ఎక్కడా ఏర్పాటు చేయడం లేదు. ఒకవేళ ఉన్నా తాళాలు వేసి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల అవి తెరచి ఉన్నా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. ప్రతి బంకులో ఫిర్యాదు పెట్టె, రిజిస్టర్ ఉండాలి. వాహనదారులు అందులో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. తాగేందుకు నీరు అందించాలి. పెట్రోలు నాణ్యతా ప్రమాణాలు పరీక్షించడానికి ఫిల్టర్ పేపర్లు వినియోగదారులకు ఇవ్వాలి.. ప్రతి బంకులో సంస్థ వివరాలతో పాటు యాజమాని పేరు అందరికీ కన్పించేలా ప్రదర్శన బోర్డు ఏర్పాటు చేసి మొబైల్ నెంబర్లు బోర్డుపై రాయాలి. అత్యధిక బంకులలో ఈ నిబంధనలు కన్పించడం లేదు. కొనుగోలుదారులు బంకుల్లో సౌకర్యాలు లేకపోతే సెంట్రలైజ్డు గ్రీవెన్స్ అండ్ మోనిటరింగ్ సిస్టమ్ పోర్టల్ అయిన పిజిపోర్టల్.జిఒఇ.ఇన్‌కు లేదా జిల్లా పౌరసరఫరా అధికారి, తూనికలు, కొలతల శాఖాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.