కిడ్నీ రోగుల పరిస్థితి దయనీయం

Mar 13,2025 22:46
కిడ్నీ

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
కొన్ని జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ మనుషుల్ని కుంగదీస్తాయి. అలాంటి వాటిలో కిడ్నీల వ్యాధి ఒకటి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన సామాన్యులకు కిడ్నీల సమస్య వస్తే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న ఈ రోగులు జిల్లా కేంద్రంలో ఉన్న కాకినాడ జిజిహెచ్‌కు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సరైన వైద్యం అందని పరిస్థితి నెలకొంది. అనేకేళ్లుగా సంబంధిత స్పెషలిస్ట్‌ డాక్టరు లేకపోవడంతో కిడ్నీ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి, అనకాపల్లి జిల్లాల నుంచి వివిధ జబ్బులకు వైద్యం నిమిత్తం ప్రతిరోజూ 3 వేల మంది రోగులు ఇక్కడకు వస్తున్నారు. వీరిలో కిడ్నీ రోగులు కూడా అధికంగానే ఉంటున్నారు. ప్రయివేటు ఆసుపత్రులలో వేలకు వేలు సొమ్ములు చెల్లించలేని సామాన్యులు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి వస్తున్నారు. అయితే ఇక్కడ కిడ్నీ వ్యాధికి వైద్యం చేసేందుకు నెప్రాలజిస్ట్‌ లేకపోవడంతో సదరు రోగులకు సరైన వైద్యం అందడం లేదు. దీంతో పలువురికి డయాలసిస్‌ చేయించుకునే స్థాయి వరకూ రోగం ముదిరిపోతుంది.సామాన్యులకు వ్యయ, ప్రయాసలుకొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది కిడ్నీ రోగుల పరిస్థితి. జిజిహెచ్‌లో కేవలం యురాలజీ, మెడిసిన్‌ డాక్టర్లు మాత్రమే కిడ్నీ వ్యాధులకు కూడా వైద్యం చేయడం వలన సదరు వైద్యులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనికితోడు నయం కావాల్సిన జబ్బు మరింతగా పెరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చినపుడు జిజిహెచ్‌లో రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. సరైన సమాచారం ఇచ్చే నాధుడు కరువవ్వడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపున ప్రయివేటు ఆసుపత్రులలో చూపించుకున్న పలువురు రోగులకు కిడ్నీ వ్యాధి ముదిరి పోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్‌ చేయించుకోవలసిందిగా అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 125 మంది ఇక్కడ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. అయితే ఖర్చుతో కూడుకున్న డయాలసిస్‌ కోసం అనేక మంది వ్యాధిగ్రస్తులు జిజిహెచ్‌కు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సరైన సమాచారం ఇవ్వడంతో ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక వైద్యుడు అవసరం

మూత్ర పిండాలు వైఫల్యం చెందడం వలన ఈ వ్యాధి తీవ్రత అంతకంతకు పెరుగుతూ వస్తోంది. రక్తం నుంచి విష పదార్థాలు, వ్యర్థ పదార్ధాలను కిడ్నీ తగిన స్థాయిలో వడపోయడంలో విఫలమైనపుడు రోగి పరిస్థితి క్షిణిస్తుంది. రెండు దశల్లో తీవ్రస్థాయి (తీవ్ర మూత్రపిండ గాయం), దీర్ఘస్థాయి (దీర్ఘ మూత్రపిండ వ్యాధి) గా మారుతుంది. ఈ నేపథ్యంలో జిజిహెచ్‌లో సంబంధిత ప్రత్యేక వైద్యుడు ఉంటే రోగ తీవ్రత స్థాయిని తగ్గించే అవకాశం ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చినపుడు సదరు డాక్టరు పరీక్షించి వైద్యం అందించడం ద్వారా డయాలసిస్‌ బాధితులు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రయివేటు ఆసుపత్రులలో మినహా జిజిహెచ్‌తో పాటు జిల్లాలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కిడ్నీ స్పెషలిస్ట్‌ లేకపోవడంతో డయాలసిస్‌ చేయించుకునే రోగులు అధికమై ప్రభుత్వంపై ఆర్థికంగా భారం కూడా పెరుగుతుంది. అయితే కాకినాడలోని ఒక ప్రయివేటు ఆస్పత్రి నెప్రలాజిస్ట్‌ ఇక్కడకు 15 రోజులకొకసారి వచ్చి సేవలు అందిస్తున్నారు. దీంతో అనేకమంది రోగులకు తీవ్ర అవస్థలు తప్పడం లేదు. ప్రతి రోజూ హెచ్‌ఐవి, హెచ్‌సివి, హెచ్‌బిఎస్‌ఎజి రోగులకు విడివిడిగా 20 నుంచి 30 మందికి డయాలసిస్‌ చేస్తున్నారు. కొన్ని సేవలకు ప్రత్యేక వైద్యులను జిజిహెచ్‌కు రప్పిస్తున్న అధికారులు కిడ్నీ వ్యాధి ప్రత్యేక డాక్టరును కూడా కనీసం వారంలో ఒక రోజయినా ఇక్కడకు రప్పించాలని రోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు కిడ్నీలూ దెబ్బతిని డయాలసిస్‌ చేయించుకుంటున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఎన్నో వ్యయ, ప్రయసలు పడుతూ ఇక్కడకు వస్తున్నారు. కోనసీమ, మెట్ట వంటి సుదూర ప్రాంతాల నుంచి రావడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికయినా జిల్లా కలెక్టర్‌ స్పందించి కిడ్నీ రోగుల సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని అంతా వేడుకుంటున్నారు.

➡️