సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
రాజ్యాంగం పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అతి ముఖ్యమైన కర్తవ్యం దేశ ప్రజలు, లౌకిక వాదులు, ప్రజాస్వామ్య వాదులపై ఉందన్నారు. దేశంలో గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి సర్కారు రాజ్యాంగాన్ని సుములంగా మార్పు చేసి, దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. లౌకికవాదాన్ని పునుదుల్లోకి తొక్కేసే పద్ధతులను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు. ప్రజా హక్కులను కాలరాస్తుందన్నారు. భారతదేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగం మౌలిక స్వభావానికి భిన్నంగా దీన్ని చేపడుతుందన్నారు. వక్ఫ్ చట్టానికి సవరణ చేయడం ద్వారా భారత రాజ్యాంగంగా ఏదైతే మతపరమైన స్వేచ్ఛహక్కులను కలిగించిందో వాటిని హరించిందన్నారు. మతపరమైన స్వేచ్ఛ లేకుండా మతోన్మాద రాజ్యాన్ని సృష్టించడానికి బిజెపి ప్రయత్నం చేస్తుంది తెలిపారు. మైనారిటీల హక్కులను పరిరక్షించడం పోయి మైనార్టీలపై దాడులకు దిగుతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఉన్మాదుల ఆగడాలను సిపిఎం ఖండిస్తుంన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పవన్, జిల్లా కమిటీ సభ్యులు కెఎస్‌వి.రామచంద్రరావు, పూర్ణిమ రాజు, నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, పోలిన వెంకటేశ్వరావు, సోమేశ్వరావు, వి.రాంబాబు, అప్పల నరసయ్య, టి.రాజేష్, ఎన్.రాజా, వై.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
