ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలి

Jan 8,2025 22:59
ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, కాకినాడప్రాథమిక పాఠశాల వ్యవస్థ(1 నుంచి 5 తరగతులు)ను పునరుద్దరించాలని యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కాకినాడలో జరుగుతున్న స్వర్ణోత్సవ మహాసభ బుధవారంతో ముగిసింది. చివరి రోజు రాష్ట్ర యుటిఎఫ్‌ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని యాజమాన్య పాఠశాలలను ఒకే విద్యా గొడుగు కిందకు తెచ్చేందుకు యుటిఎఫ్‌ కృషి చేస్తుందన్నారు. అవసరమైతే ఎల్‌కెజి, యుకెజిలను కూడా వీటిలోనే నిర్వహించాలన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో జరగాలన్నారు. హైస్కూల్లో రెండు మీడియంలలో బోధన కొనసాగించాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, సాంకేతిక స్పహ పెంపొందించాలన్నారు. అనంతరం రాష్ట్రంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో జిల్లాల వారీగా విశ్లేషణ జరిపి చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమాల నిర్వహణా బాధ్యతలు చేపట్టిన కాకినాడ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నగేష్‌, టి.చక్రవర్తి మాట్లాడుతూ ఈ మహాసభకు సహకరించిన ప్రజాసంఘాలకు, వివిధ శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ప్రసాదరావు, చిలుకూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం యుటిఎఫ్‌ కార్యచరణ తీసుకుందని చెప్పారు.చివరి రోజు మహాసభలో కాకినాడ ఎంపీ ఉదరుశ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల బకాయిల విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని చెల్లిస్తుందన్నారు. గత ప్రభుత్వం జల జీవన్‌ పథకం నిధులు రూ.21 వేల కోట్లను సక్రమంగా ఖర్చుపెట్టలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ మాట్లాడుతూ యుటిఎఫ్‌ నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయ సంఘమన్నారు. స్వర్ణోత్సవాలు జరుగుతున్న కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ విబి.తిరుపాణ్యం మాట్లాడుతూ తమ కళాశాలలో యుటిఎఫ్‌ సర్ణోత్సవాలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నికయుటిఎఫ్‌ రాష్ట్ర మహాసభ చివరి రోజు రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు, అధ్యక్షులుగా ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా కె.సురేష్‌ కుమార్‌, ఎఎన.్‌కుసుమకుమారి, కోశాధికారిగా ఆర్‌.మోహన్‌రావు, 15 మంది రాష్ట్ర కార్యదర్శులతో నూతన కమిటీ ఏర్పడింది. ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా టిఎస్‌ఎన్‌ఎల్‌.మల్లేశ్వరరావు, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులుగా కె.సురేష్‌ కుమార్‌, ప్రచురణాల కమిటీ చైర్మన్‌గా ఎం.హనుమంతరావు, కుటుంబ సంక్షేమ పథకం అధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు, అధ్యయన కమిటీ అధ్యక్షులుగా పి.బాబు రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. స్వర్ణోత్సవ మహాసభను ఘనంగా నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి కార్యకర్తలను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో సభ్యత్వం జనరల్‌ ఫండ్‌ అధికంగా వసూలు చేసిన శాఖలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సభలో పలు కొత్త పుస్తకాలను ఆవిష్కరించారు. నాలుగు రోజులుగా అనేక సాంస్కతి కార్యక్రమాలు ప్రదర్శించిన ఉపాధ్యాయ బృందాలకు బహుమతులు అందించారు.

➡️