ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌వేసవి వడగాలుల నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్‌లో క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడగాలుల తీవ్రత దృష్ట్యా సమన్వయ శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపారు. చలివేంద్రాలలో కుండల ద్వారా చల్లని శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని, ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడగాలులు తీవ్రత దృష్ట్యా చేయదగినవి, చేయతగని వాటిపై గ్రామాల్లో, వార్డుల్లో ప్రచారం చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు పని చేసే ప్రదేశాల్లో నీడ ఉండేలా టెంట్స్ ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, పాలిచ్చే తల్లుల విషయంలో వారికీ సాధ్యమయ్యే పనులను ఇవ్వాలని, ఎండ తీవ్రత పెరగకుండా సమయ పాలన విషయంలో ముందుగా పనులను ప్రారంభించాలని సూచించారు. వేసవి దృష్ట్యా ఐస్ సరఫరా చేసే ఫ్యాక్టరీల నిర్వహణ వ్యవస్థ దృష్టి పెట్టాలని, శుద్ధమైన నీటితో మాత్రమే ఐస్ తయారు విధానంలో పయోగిస్తున్నారో లేదో తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. పాఠశాలల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే డిఇఒ కార్యాలయ సూపరింటెండెంట్ నాగేశ్వర రావుకు 919398680029లో ఫిర్యాదు చెయ్యవచ్చు అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ కార్మికులకు, విద్యా సంస్థలకు, తగిన విధంగా ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కెఆర్‌సిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ బివి.గిరి, డిపిఒ వి.శాంతామణి, డిఇఒ ఎస్.వాసుదేవరెడ్డి, డిఎల్‌డిఒ పి.వీణాదేవి, కె.విజరు కుమారి, డీఎంహెచ్వో తరపున ఎన్. వసుంధర, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
