విద్యార్థుల్లో సృజనాత్మకతకు కొదవ లేదు

Nov 30,2024 23:07
విద్యార్థుల్లో సృజనాత్మకతకు కొదవ లేదు

ప్రజాశక్తి-రాజానగరం విద్యార్థులలో సృజనాత్మకతకు కొదవ లేదని మెరుగైన విద్యా బోధన ద్వారా మంచి ఫలితాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయంలో ఎఐసిటిఇ సౌజన్యంతో ఇన్నోవేషన్‌ డిజైన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న బూట్‌ కాంప్‌ శనివారంతో ముగిసింది. ఈ క్యాంప్‌లో డిఇఒ మాట్లాడుతూ ఈ రెండు రోజులు శిక్షణలో ఉపాధ్యాయులు తాము నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అందించడంతో గొప్ప విజ్ఞాన వేత్తలుగా తయారు చేయాలని కోరారు. నూతన పద్తతులతో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు ఈ శిక్షణలు ఉపయోగపడతాయన్నారు. హైదరాబాదులోని జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సిఇఒ డాక్టర్‌ ఎస్‌.సెంథిల్‌ వినాయగం మాట్లాడుతూ సృజనాత్మకతల ఆవిష్కరణల దశాబ్దం తరువాత ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆవిష్కరణలకు తాము మద్దతునిస్తున్నామని తెలిపారు. వ్యవస్థాపకులకు సాంకేతికత నిర్వహణ వ్యక్తిగత నైపుణ్యాలు ఎంతో అవసరమని అన్నారు. వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించుకునే పద్ధతులను వివరించారు. విశాఖపట్నంలోని ఎంఎస్‌ఎం ఈ మెకాట్రానిక్స్‌ హెడ్‌ డాక్టర్‌ కె.మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల అంకుర పరిశ్రమలకు నిధుల అవకాశాలపై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కాంప్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ టి.జయానంద కుమార్‌, డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పిఎంఎంఎస్‌.శర్మ, నోడల్‌ అధికారులు దండమూడి విజేంద్రకుమార్‌, కె.వినోద్‌ వర్మ పాల్గొన్నారు.

➡️