విద్యుదాఘాతానికి ముగ్గురు కార్మికులు బలి

Apr 12,2025 23:14 #Current shock, #East Godavari
  • రైసు మిల్లులో కన్వేయర్‌ బెల్ట్‌ను తీస్తుండగా ఘటన

ప్రజాశక్తి- కోరుకొండ(తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని సూర్య మహాలక్ష్మి ట్రేడర్స్‌ రైస్‌ మిల్లులో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. తోటి కార్మికులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు…. కాపవరానికి చెందిన ఆకుల శ్రీరాములు (30), బలసాని అన్నవరం (45), జాజులు వెంకటేశ్వరరావు (55) స్థానికంగా ఉన్న సూర్య మహాలక్ష్మి ట్రేడర్స్‌ రైసు మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎప్పటిలానే శనివారం రైసుమిల్లులో పనికి వెళ్లారు. ధాన్యాన్ని హైడ్రాలిక్‌ కన్వేయర్‌ బెల్త్‌ ద్వారా లోడ్‌ చేయడానికి మరికొంతమంది కార్మికులతో కలిసి పనికి ఉపక్రమించారు. లోడింగ్‌కు అనువుగా కన్వేయర్‌ బెల్ట్‌ను మరో ముగ్గురు కార్మికులతో కలిసి మార్చుతున్నారు.
ఈ సమయంలో బెల్టుకు సపోర్టుగా ఉండే ఇనుప కడ్డీలు పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్‌ వైర్లకు తగిలాయి. దీంతో, కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో శ్రీరాములు, అన్నవరం, వెంకటేశ్వ రరావు అక్కడి క్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు గాయా లతోబయట పడ్డారు.
ఒక్కో మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు ఇచ్చేందుకు మిల్లు యాజమాన్యం అంగీకారం
రాజానగరం ఎంఎల్‌ఎ బత్తుల బలరామకృష్ణ ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతుల, కుటుంబాలను ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు రైస్‌ మిల్లు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందేలా చూస్తానన్నారు.

➡️