18 వరకూ క్రియేటివ్‌ కంటెంట్‌పై శిక్షణ

May 16,2024 22:02
18 వరకూ క్రియేటివ్‌ కంటెంట్‌పై శిక్షణ

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంస్థానిక ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల (ఆర్ట్స్‌ కళాశాల)లో ఎపి ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి శనివారం వరకూ వరకు రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు క్రియేటివ్‌ కంటెంట్‌ జనరేషన్‌ విధానంపై శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కళాశాల ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోల భాస్కర్‌ గురువారం ప్రారంభించారు. కళాశాలలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధ్యాపకులు విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా విద్యను బోధించడానికి, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో తీసుకు రావడానికి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అధ్యాపకులు వారి ఎల్‌ఎంఎస్‌ కంటెంట్లను తయారు చేయడంలో వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కె మాట్లాడుతూ కళాశాల విద్యను మరింత ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆంధ్ర రాష్ట్ర కళాశాల ఉన్నత విద్యాశాఖ కమిషనరేట్‌ వివిధ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి ఆర్ట్స్‌ కళాశాల నిరంతరం ప్రయత్నిస్తుందని ఇందులో భాగంగానే ఈ సంవత్సరం స్టడీ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు వేదిక కానుందని, ఇప్పటికే 9 మంది విదేశీ విద్యార్థులు ఈ విధానం ద్వారా కళాశాలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల ఉన్నత విద్యాశాఖ ఎజిఒ డాక్టర్‌ తులసి, ఒఎస్‌డిఐటి డాక్టర్‌ కవిత మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యా విధానంలో కత్రిమ ప్రజ్ఞ, సాంకేతికతను ఉపయోగించి విద్యార్థి స్వయం అభ్యసనాన్ని పెంచడం, అధ్యాపకుడు నిరంతరం విద్యార్థికి అందుబాటులో ఉండేలా చేయడం అని తెలిపారు. ఆర్‌జెడిసిఇ డాక్టర్‌ ఎస్‌.శోభారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉన్నత లక్ష్యంతో రూపొందించిందని, అధ్యాపకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుమారు 100 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు శాఖ విభాగాధిపతి డాక్టర్‌ పిఎ.సత్యనారాయణ పుస్తకం ఒక చలికాలపు వేకువలో అనే కవితా సంపుటిని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ డాక్టర్‌ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️