రైతుల గుండెల్లో వణుకు

Nov 27,2024 22:22
రైతుల గుండెల్లో వణుకు

వాతావరణ శాఖ తుపాను ప్రకటనతో రైతుల గుండెల్లో వణుకు మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారింది. దీన్ని ప్రభావం వల్ల ఇప్పటికే జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఇంకా పంట కళ్లాల్లోనే ఉండటంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగమయ్యారు. ప్రజాశక్తి – రాజోలు, ఉప్పలగుప్తం, రాజమహేంద్రవరం రూరల్‌బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారింది. దీని ప్రభావంతో బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం అర్ధరాత్రి నుంచి తుపాను ప్రభావం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో అన్నదాతల్లో అందోళన నెలకొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 12 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. చాలా వరకూ పంట కళ్లాలోనే ఉంది. సుమారు 5లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. వీటిని పొలాల్లో, రోడ్ల చెంతనే ఉంచారు. హడావుడిగా వరి కోతలువాతావరణ హెచ్చరికల నేపథ్యంలో నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. వరికోత మిషన్లతో రైతులు హడావుడిగా కోతలను నిర్వహిస్తున్నారు. దీంతో వరికోత మిషన్లకు డిమాండ్‌ పెరిగింది. ప్రతీ గ్రామంలో పదుల సంఖ్యలో కోత యంత్రాలు పని చేస్తున్నాయి. ఒక యంత్రం రోజుకు 10 నుంచి 12 ఎకరాల్లో వరి కోత కోస్తోంది. ప్రస్తుతం వరికోతలు ఆపాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కోతలు ప్రారంభిస్తే వర్షాలకు తడిపి ధాన్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ బుధవారం సాయంత్రం వరకూ కోతలను కోసి ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునే పనిలో రైతన్నలు నిమగమయ్యారు. చాలా చోట్ల రైతులు కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.నేలవాలితే నష్టమే…వరి కోత దశలో వర్షాలొస్తే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్నిచోట్ల నేలవాలిన పంటపై చినుకులు పడితే ధాన్యం మొలకలొచ్చే అవకాశం ఉంది. తుపాను గాలి వల్ల వర్షం పడి ఆగిపోతే పెద్దగా నష్టం ఉండదు. గాలి వేగం ఎక్కువగా ఉంటే పంట నేలవాలిపోతుంది. దీనివల్ల మొలకలొస్తాయి. యంత్రంతో కోత కోయడానికి ఎక్కువ సమయం పడుతుంది. సూచనలు పాటిస్తే..కోతకు వచ్చిన పంటను వెంటనే నూర్పిడి చేయాలి.కోతకు ఇంకా సమయం ఉంటే పొలంలో బాటలు చేసుకుని నీరు బయటకు వెళ్లేలా చూడాలి.బాటలు చేయడం వల్ల గాలికి పంట చిందరవందరగా పడిపోకుండా ఉంటుంది.వర్షపు నీరు పొలంలో నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

➡️