‘కేంద్ర మంత్రి అమిత్‌ షా గో బ్యాక్‌’

Jan 19,2025 22:24
'కేంద్ర మంత్రి అమిత్‌ షా గో బ్యాక్‌'

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి, దేవరపల్లిభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా తక్షణమే రాజీనామా చెయ్యాలని పలువురు వామపక్షాల పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. మంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్‌ అమిత్‌ షా పేరుతో చేపట్టిన నిరసనలో భాగంగా రాజమహేంద్రవరం నగరం గోకవరం బస్టాండ్‌, అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌లో వామపక్ష పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు జె.సత్తిబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ మాట్లాడారు. పార్లమెంట్‌లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌పై అమిత్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత పార్లమెంట్‌ వ్యవస్థకు ప్రజా స్వామ్యానికి మూల స్తంభం అయిన డాక్టర్‌ అంబేద్కర్‌ అంటే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని తెలిపారు. ఈ శక్తులకు రాజ్యాంగం అన్నా అంబేద్కర్‌ అన్నా ద్వేషం అని రాజ్యాంగం బదులు మనుస్మతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. దేవుని నామం స్మరించుకోవటం వల్ల ఎవరికి ఏం జరిగిందో తెలియదు గానీ అంబేద్కర్‌ వల్ల మోడీ షాలు పార్లమెంట్‌లో మాట్లాడ గలుగుతున్నారని అన్నారు. కోట్లాది నిమ్న జాతుల ప్రజలు, మహిళలు ఆత్మ గౌరవానికి అంబేద్కర్‌ ప్రతిబింబం అని అంబేద్కర్ను అవమానించిన షా రాజ్యాంగ పదవిలో కొనసాగడానికి అనర్హుడని అన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై టిడిపి, వైసిపి, జనసేన నాయకులు కనీసం స్పందించలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలనికి వారు దాసోహం అయ్యారని విమర్శించారు. ఓట్ల కోసం అంబేద్కర్‌ను ఉపయోగించుకుంటున్న అధికార, ప్రతిపక్షాలు అంబేద్కర్‌ను అవమానిస్తే ఎందుకు స్పందించలేదని ప్రశించారు. మునుధర్మ శాస్త్రాన్ని తగులబెట్టి 95 శాతం ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన అంబేద్కర్‌ను ప్రజలందరూ హక్కులు పొందిన ప్రతి సందర్భంలో స్మరించుకుంటారని దానిని ఎవరూ నిలువరించలేరని అన్నారు. అమిత్‌ షా అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.పవన్‌, పి.తులసి, జిల్లా కమిటీ సభ్యులు కర్రి రామకృష్ణ, పూర్ణిమరాజు, రాజా, నాయకులు ఎస్‌ఎస్‌.మూర్తి, పి.మురళి, తాతారావు, కాంతారావు, పడాల రామకష్ణ, భాస్కర్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.లావణ్య, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు టి.నాగేశ్వరరావు, ఎఐవైఎఫ్‌ జిల్లా నాయకులు త్రిమూర్తులు, కొండవతి, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు జె.సత్తిబాబు, దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ పాల్గొన్నారు.దేవరపల్లి కేంద్ర మంత్రి అమిత్‌ షా గో బ్యాక్‌ కార్యక్రమాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె.రత్నాజీ, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు సిహెచ్‌.రమేష్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులను అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను అవమానించడం దారుణం అన్నారు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో భాగంగానే అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్య చేశారని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా మంత్రి పదవి నుంచి అమిత్‌షాను తొలగించాలని, డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు అమిత్‌ షా వ్యాఖ్యలపై తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆచంట సత్యనారాయణ, ఎఎఫ్‌టియు నాయకులు పి.పెంటయ్య, సిపిఎం నాయకులు అయినపర్తి శ్రీనివాసరావు, పెనమనేని సత్యనారాయణ, ఆచంట సుభాష్‌ చంద్రబోస్‌, మేడా వెంకటేష్‌ సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️