యుటిఎఫ్‌ సత్యాగ్రహ దీక్ష

Oct 2,2024 23:34
యుటిఎఫ్‌

సమస్యలపై మున్సిపల్‌ ఉపాధ్యాయుల నిరసన
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
దీర్ఘకాలికంగా పెండింగ్‌ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉపాధ్యాయులు బుధవారం రాజమహేంద్రవరంలోని దండి మార్చ్‌ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.జయకర్‌ ఈ దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణకుమారి మాట్లాడుతూ ఎంతోకాలంగా మున్సిపల్‌ శాఖలో పని చేసే ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతలు, వివిధ కేడర్లలో టీచర్‌ పోస్టు అప్‌గ్రేడేషన్‌ వంటి ఎన్నో సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. యుటిఎఫ్‌ పక్షాన పలుమార్లు అధికారులకు విన్నవించినా సరైన స్పందన రాలేదన్నారు. అందుకే సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్‌ నెల నుంచి దశలవారీ పోరాటాన్ని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో చేస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే విద్యా డైరెక్టర్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.షరీఫ్‌ మాట్లాడారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల పిఎఫ్‌ సమస్యను తక్షణం పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ని నియమించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు జయకర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ పాఠశాలలో అర్హులైన ప్రధానోపాధ్యాయులను అర్బన్‌ ఎంఇఒగా నియమించాలని కోరారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మూడు గంటల పాటు సత్యాగ్రహ దీక్షను ఉపాధ్యాయులు చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాజమహేంద్రవరం మున్సిపల్‌ శాఖ అధ్యక్షులు గోపి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎవి.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️