ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌రబీ సీజన్లో గోదావరి డెల్టా క్రింద డిసెంబర్ 1వ తేది నుంచి 2025 మార్చి వరకు 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగు, తాగునీరు అవసరాలకు నీటిని విడుదల చేయనున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. తూర్పు డెల్టాలో 2,64,507 పశ్చిమ డెల్టాలో 4,60,000 సెంట్రల్ డెల్టాలో 1,72,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చెయ్యనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదిలో 91.35 టిఎంసిల నీరు అందుబాటులో ఉందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రబీ ఆయకట్టుకు సంబంధించి గోదావరి తూర్పు డెల్టా కడియం అనపర్తి, బిక్కవోలు మండలాల సంబంధించి 27,001 ఎకరాల ఆయకట్టుకు, గోదావరి పశ్చిమ డెల్టా కింద కొవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలకు సంబంధించి 35,710 ఎకరాల ఆయకట్టుకు, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా కోరుకొండ సీతానగరం మండలంలో 1650 ఎకరాల ఆయకట్టుకు మొత్తం 64,361 ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగునీరు విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఎర్ర కాలువ, కొవ్వాడ కాల్వ కింద గోపాలపురం, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లోని ఆయకట్టు వరదలు, భారీ వర్షాల కారణంగా ఏటా అనేక వేల ఎకరాల ఆయకట్టు ముంపునకు గురవుతున్నాయని, కాల్వలను ఆధునీకరణ పనులు చేపట్టి, గుండ్లను పూడ్చివేసి ఏటిగట్ల పటిష్టవంతం చెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎర్ర కాలువ, కొవ్వాడ, చింతలపూడి, తొర్రిగడ్డ, సీతానగరం, ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆయా ప్రాజెక్ట్ పరిధిలో సీజన్ వారీగా సాగు విస్తీర్ణం, ఆయకట్టు సాగు అంశాలకు సంబంధించిన అంశాలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పురుషోత్తపట్నం, చింతలపూడి, పట్టిసీమ వెంకట నగర్ ఎత్తిపోతల పథకం పనితీరుపై ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో ఇరిగేషన్ పనులు పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డిఆర్‌ఒ టి.సీతారామమూర్తి, జిల్లా నీటిపారుదల అధికారి జి.శ్రీనివాసరావు, ఆర్‌డిఒలు ఆర్.కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, ఎల్‌ఎంసి లెఫ్ట్ కెనాల్ ఎస్‌ఇ ఏసు బాబు, ఏలూరు ఎస్‌ఇ దేవ ప్రకాష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ బి.వెంకటగిరి, వ్యవసాయ శాఖ ఎడిలు, పి.చంద్ర శేఖర్, డివి.కృష్ణ, డి.శ్రీనివాస రెడ్డి, బికె.మల్లికార్జున రావు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.